ఇండ‌స్ట్రీని చూసి సిగ్గుప‌డుతున్నా:జీవిత‌

Update: 2018-04-17 16:48 GMT
న‌టి శ్రీ‌రెడ్డితో పాటు కొంద‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు - జూనియ‌ర్ ఆర్టిస్టులు.....కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ లో ప‌లువురు సెల‌బ్రిటీల‌పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న‌పై - త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ను న‌టి - నిర్మాత‌ - ద‌ర్శ‌కురాలు జీవిత తీవ్రంగా ఖండించిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన జీవిత‌....టాలీవుడ్ వైఖ‌రిని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. ఇన్ని రోజుల నుంచి ఇంత ర‌చ్చ జ‌రుగుతున్న టాలీవుడ్ నుంచి ఒక్క‌రూ స్పందించ‌లేద‌ని, టాలీవుడ్ ను చూసి సిగ్గుపడుతున్నాన‌ని జీవిత నిప్పులు చెరిగారు. ఇండ‌స్ట్రీపై ఆ స్థాయిలో విమర్శలు వస్తుంటే ఎవ్వ‌రూ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్రశ్నించారు. గ‌త వారం రోజులుగా న్యూస్ చానెళ్ల‌లో వ‌స్తోన్న చర్చలు చూసి కడుపు మండిపోయిందని, టాలీవుడ్ కు ఈ దుస్థితి ప‌ట్టిందా అనిపించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డ్రగ్స్ కేసు వ్య‌వ‌హారంలో కూడా ఇండ‌స్ట్రీలో అంద‌రిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని, అపుడు కూడా ఎవ‌రూ మాట్లాడేందుకు ముందుకు రాలేద‌ని అన్నారు. త‌న‌పై, త‌న భ‌ర్త‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్యానించిన వారిపై లీగ‌ల్ గా ప్రొసీడ్ అవుతాన‌ని, త‌న వెంట ఎవ‌రూ రాకపోయినా తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. త‌న‌వైపు న్యాయం ఉంద‌ని, న్యాయం ఉంది క‌నుక మీడియా మ‌ద్దతు కూడా త‌న‌కు ఉంటుంద‌ని అన్నారు. ఈ ప్రెస్‌మీట్‌ చూసిన త‌ర్వాతైనా....ఇండ‌స్ట్రీ త‌ర‌ఫు నుంచి తనకు మద్దతు వ‌స్తుంద‌ని తాను ఆశిస్తున్నానని జీవిత అభిప్రాయ‌ప‌డ్డారు.

టీవీల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌లు చూస్తుంటే క‌డుపు మండిపోతోంద‌ని జీవిత అన్నారు. ఏ వ్యాపార వేత్తో, రాజ‌కీయ వేత్తో గురించి ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తే...దాని గురించి ఇంత చ‌ర్చ జ‌రుగుతుందా అని జీవిత ప్ర‌శ్నించారు. కేవలం సినిమా వాళ్లంటే చుల‌క‌న అని , వారి గురించి వెంట‌నే హైలైట్ చేస్తార‌ని మండిప‌డ్డారు. ఇంత జ‌రుగుతున్నా ఇండ‌స్ట్రీ నుంచి ఒక్క‌రూ మాట్లాడ‌ర‌ని...ఎందుకు మాట్లాడ‌రో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. త‌మ‌ను వేధించార‌ని చెబుతున్న వారు ఫిర్యాదు చేయ‌ర‌ని, మొత్తం ఇండ‌స్ట్రీ త‌ప్పు చేసింద‌ని స్టేట్ మెంట్లు ఇస్తార‌ని మండిప‌డ్డారు. లైవ్ డిబేట్ల‌లో రేటింగ్స్‌ పెంచుకోవడానికే కొన్ని ప్ర‌శ్న‌లు వేసి హైలైట్ చేస్తార‌ని, అది త‌న‌కు న‌చ్చ‌ద‌ని, అందుకే ప్రజలకు నిజాలు చెప్పాల‌ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాన‌ని అన్నారు. త‌న‌పై, త‌న భ‌ర్త‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఆధారాలను సంధ్యగారు బ‌య‌ట‌పెట్టాల‌ని, తాను కూడా త‌న ద‌గ్గ‌రున్న వాటిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పారు. పవన్ కల్యాణ్ ఏం త‌ప్పు మాట్లాడార‌ని శ్రీరెడ్డి అలా అభ్యంతరకర వ్యాఖ్య‌లు చేసింద‌ని జీవిత మండిప‌డ్డారు. దివంగ‌త దాసరి నారాయణరావు ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని, ఆయన కచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించేవారని, ఆయ‌న లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్పారు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలపై జమున, జయసుధ, విజయనిర్మల, జయప్రద అందరూ స్పందించాల‌ని జీవిత కోరారు. త‌న ప్రెస్ మీట్ త‌ర్వాత ఇండ‌స్ట్రీలో కదలిక వస్తుందని ఆశిస్తున్నాన‌ని అన్నారు. క‌నీసం, ఇఎల్లుండి తమ‌ లాయర్ తో కలిసి మళ్లీ మీడియా స‌మావేశం ఏర్పాటు చేస్తాన‌ని, ఆరోజు మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డిస్తాన‌ని జీవిత అన్నారు.
Tags:    

Similar News