రాజ‌శేఖ‌ర్ ఎపిసోడ్ ఇంకా బాధిస్తూనే ఉంద‌న్న జీవిత‌

Update: 2021-06-27 11:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ర‌చ్చ వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఇప్ప‌టి నుంచే వ‌ర్గ పోరు మొద‌లైంది. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం ఇప్ప‌టికే ప్యానెల్ ని ప్ర‌క‌టించి ఇత‌రుల కంటే ముందంజ‌లో ఉండ‌గా.. మంచు విష్ణు.. జీవిత రాజ‌శేఖ‌ర్.. హేమ కూడా అధ్య‌క్ష ప‌ద‌వి బ‌రిలో నిలుస్తున్నారు.

అయితే ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ వీకే న‌రేష్ ఎపిసోడ్స్ అనంత‌రం జీవిత రాజ‌శేఖ‌ర్ ప‌లు మీడియాల‌తో మాట్లాడుతూ క‌ల‌త‌ల కాపురం గురించి ... ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న త‌న ఆస‌క్తి గురించి బ‌హిరంగంగా మాట్లాడారు.

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ద‌లిస్తే తాను ఎలాంటి ప్యానెల్ ఏర్పాటు చేయ‌కుండా స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తాన‌ని జీవిత తెలిపారు. అసోసియేష‌న్ లో గొడ‌వ‌ల ర‌చ్చ‌కు కార‌ణం ఈగోలేన‌ని జీవిత అన్నారు. అంతా క‌లిసి కూచుని మాట్లాడుకుని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంద‌ని అలా కాకుండా భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం ద్వారా స‌మ‌స్య‌లు ఎప్ప‌టికీ ప‌రిష్కారం కావ‌ని అన్నారు.

రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేసిన‌ప్పుడు మా వ‌ర్గాలు వ్య‌వ‌హ‌రించిన తీరు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని .. అంద‌రూ కూచుని మాట్లాడుకుందామనుకున్నా ఏకాభిప్రాయాలు కుద‌ర‌లేద‌ని జీవిత అన్నారు. రాజశేఖ‌ర్ రాజీనామా చేశాక తాను కూడా త‌న ఆఫీస్ బేర‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నుకున్నాన‌ని జీవిత అన్నారు. కానీ రాజ‌శేఖ‌ర్ స‌ర్ధి చెప్పార‌ని తెలిపారు. ఇక రాజ‌శేఖ‌ర్ విష‌యంలో జ‌రిగిన దానిని తాను ఇంకా మ‌ర్చిపోలేక‌పోతున్నాన‌ని జీవిత అన్నారు. అది ఇంకా వెంటాడుతూనే ఉంద‌ని అన్నారు.

అలాగే 950 మంది స‌భ్యులున్న మా అసోసియేష‌న్ లో 350 మంది మ‌హిళా స‌భ్యులున్నార‌ని జీవిత వెల్ల‌డించారు. ఈసారి మ‌హిళ‌ను అధ్య‌క్షురాలిని చేస్తాన‌ని పెద్ద‌లు అన్నార‌ని... దానికి స‌మ‌యం వ‌చ్చింద‌ని అన్నారు. రెండు ప్యానెల్స్ పోటీ చేసిన‌ప్పుడు ఇరు ప్యానెళ్ల నుంచి గెలుస్తార‌ని దానివ‌ల్ల భిన్నాభిప్రాయాల‌తో ప‌నులు అవ్వ‌వ‌ని కూడా జీవిత అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తానికి అధ్య‌క్షురాలు అవ్వాల‌న్న త‌న కోరిక‌ను మీడియా ఇంట‌ర్వ్యూల్లో జీవిత ఎక్క‌డా దాచుకోలేదు. అలాగే సినీపెద్ద‌ల నిండు స‌భలో రాజ‌శేఖ‌ర్ ప‌ద‌విని కోల్పోయిన‌ ఎపిసోడ్.. క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్చ‌ల ప్ర‌హ‌స‌నం.. త‌న‌ని ఇంకా వెంటాడుతోంద‌ని మ‌ర్చిపోలేక‌పోతున్నార‌ని చెప్ప‌క‌నే చెప్పారు.
Tags:    

Similar News