జాన్వి... హార్ట్ ట‌చింగ్ లెట‌ర్!!

Update: 2018-03-03 10:34 GMT

శ్రీదేవి పెద్ద‌కూతురు జాన్వి క‌పూర్‌. త‌ల్లి చ‌నిపోయిన బాధ నుంచి తేరుకోలేక‌పోతోంది. వారం క్రితం శ్రీదేవి దుబాయ్‌ లో హ‌ఠాత్తుగా మ‌ర‌ణించింది. అప్ప‌టికి జాన్వీ ముంబైలో ఒంటరిగా ఉంది. సినిమా షూటింగ్ కోసం ఆమె త‌ల్లితో వెళ్ల‌కుండా ఉండిపోయింది. త‌ల్లి మ‌ర‌ణించిన బాధ‌లోనే ఇంకా ఉండ‌గా... జాన్వీ 21వ పుట్టిన‌రోజు వచ్చేస్తోంది. మార్చి 7న ఆమె పుట్టిన‌రోజు. ఈ సందర్భంగా ఆమె త‌న త‌ల్లినుద్ధేశించి అభిమానుల‌కు ఇన్‌ స్టాగ్రామ్ లో ఒక హార్ట్ టచింగ్ ఉత్త‌రం రాసింది.

త‌ల్లి లేక త‌న గుండెల్లో ఎంతో శూన్యం ఆవ‌రించింద‌ని... అయినా కూడా ప్రేమ‌ను ఫీల‌వుతున్నాన‌ని... అందుకు అమ్మ చూపిన ప్రేమే కార‌ణమ‌ని రాసింది. ఆ ప్రేమ త‌న‌ను బాధ‌... మ‌న‌సును మెలిపెట్టే గాయం నుంచి తేరుకునేలా చేస్తోంద‌ని తెలిపింది. క‌ళ్లు మూసుకుంటే చాలు... కుప్ప‌లుగా ఎగ‌సిప‌డే అంద‌మైన జ్ఞాప‌కాలు త‌న‌ను క‌మ్మేస్తున్నాయ‌ని... ఆ జ్ఞాప‌కాలన్నీ త‌ల్లి ఇచ్చిన‌వేన‌ని గుర్తు చేసుకుంది. త‌మ జీవితాలలో శ్రీదేవిలాంటి త‌ల్లి ఉండ‌డం త‌మ అదృష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. తాము కేవ‌లం అమ్మనే కోల్పోయామ‌ని... తండ్రి బోనీ క‌పూర్ త‌న ప్రాణాన్నే కోల్పోయిన‌ట్టు అయింద‌ని ఆవేద‌న చెందింది. త‌న త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఉన్న ప్రేమ అనిర్వ‌చ‌నీయ‌మైన‌ద‌ని.... ఆ ప్రేమ శాశ్వ‌త‌మైన‌ద‌ని చెప్పుకొచ్చింది. వారి మ‌ధ్య ప్రేమ గురించి ఎవ‌రు ఏమాత్రం త‌క్కువ‌గా మాట్లాడినా తాము త‌ట్టుకోలేమ‌ని చెప్పింది. అంతేకాదు త‌న పుట్టిన రోజున అభిమానుల‌ను కోరుతున్న‌ది ఒక్క‌టేన‌ని... వారి వారి త‌ల్లిదండ్రులు గౌర‌వించ‌మ‌ని అభ్య‌ర్థించింది.

జాన్వి పోస్ట్ లేఖ‌లో ఏముందంటే..

జాన్వి పోస్ట్ కు స్వేచ్ఛానువాదం చేస్తే..

"ఇప్పుడు హృద‌యానికి త‌గిలిన గాయంతో బ‌త‌క‌టం ఎలానో నేర్చుకోవాలి. చుట్టూ ఆవ‌రించిన ఇంత శూన్యంలోనూ నీ ప్రేమానుభూతిని పొందుతున్నా. బాధ‌.. విచారంలో కూరుకుపోయిన నన్ను ర‌క్షిస్తున్న‌ట్లుగా భావిస్తున్నా. క‌ళ్లు మూసుకుంటే చాలు.. అన్నీ మంచి విష‌యాలే గుర్తుకొస్తున్నాయి"

"నీ గురుతుల‌తో ఉండిపోతున్నా.  మంచి విష‌యాలు గుర్తుకు రావ‌టానికి నువ్వే కార‌ణ‌మ‌ని తెలుసు. సాధ్య‌మైనంత కాలం మా జీవితాల్లో నువ్వు ఉండ‌టం మేం చేసుకున్న అదృష్టం. నువ్వు చాలా మంచిదానివి. స్వ‌చ్ఛ‌మైన‌దానివి. అందుకేనేమో.. దేవుడు నిన్ను త్వ‌ర‌గా తీసుకెళ్లిపోయారు"

"నేనెప్పుడూ సంతోషంగా ఉంటాన‌ని స్నేహితులు అంటుంటారు. దానికి కార‌ణం నువ్వేన‌న్న విష‌యం నాకిప్పుడు అర్థ‌మ‌వుతోంది. న‌న్ను ఎవ‌రేమ‌న్నా ప‌ట్టించుకోలేదు. ఏదీ పెద్ద స‌మ‌స్య‌గా అనిపించ‌లేదు. ఏ రోజూ నిస్తేజంగా ఫీల‌వ్వ‌లేదు. కార‌ణం.. అప్పుడు నువ్వు నాతో ఉండ‌ట‌మే"

"నేనెప్పుడూ ఎవ‌రి మీదా ఆధార‌ప‌డిలేను. ఎందుకంటే నాక్కావాల్సిన ఒకే ఒక్క వ్య‌క్తివి నువ్వే.  నువ్వు.. నా ప్రాణ‌ స్నేహితురాలివి. నా ఆత్మ‌లో భాగానివి. మా కోసం నీ జీవితాన్ని అర్పించావు"

"ఇప్పుడు నీ కోసం నేనా ప‌ని చేస్తా. నువ్వు గ‌ర్వ‌ప‌డేలా చేస్తా. ప్రతీ ఉద‌యం అదే ప్ర‌తిజ్ఞ‌తో నిద్ర లేస్తా. నువ్వు నాలో.. ఖుషిలో.. నాన్న‌లో నిండి ఉన్నావు. నీ ప్ర‌భావం మాపై చాలా ఎక్కువ‌. చాలా బ‌ల‌మైంది. మేం బ‌త‌క‌టానికి అది చాలు. నువ్వు లేని లోటును పూరించ‌టం మాత్రం కుద‌ర‌దు. ఐల‌వ్యూ..!"

శ్రీదేవి అస్థిక‌ల‌ను శ‌నివారం త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో క‌ల‌పబోతున్నారు. దుబాయ్‌లో అనుకోకుండా బాత్‌ట‌బ్‌లో ప‌డి శ్రీదేవి మ‌ర‌ణించ‌డంపై స‌ర్వ‌త్రా అనుమానాలు నెల‌కొన్నాయి. దుబాయ్‌లోనే మూడు రోజుల పాటూ పార్థివ దేహాన్ని ఉంచేశారు. అనంత‌రం ప్ర‌త్యేక విమానంలో ముంబై చేర్చి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.
Tags:    

Similar News