హీరో విశాల్ కు ఈ మధ్యకాలంలో కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికల సమయం నుంచి నేటి వరకూ విశాల్ పై కొత్త కొత్త ఆరోపణలు వస్తూనే ఉనాయి. అయితే తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ ఆర్టిస్టు కు సంబందించిన విషయం విశాల్ పై వచ్చిన కొత్త ఆరోపణలకు కారణం. దీంతో మరోసారి నడిఘర్ సంఘం సాక్షిగా విశాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
సెల్వరాజ్ అనే జూనియర్ ఆర్టిస్టు తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నడిగర్ సంఘం ఆదుకోలేదన్న ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కోలీవుడ్ పరిశ్రమలో ఈ విషయం కలకలం రేపింది. ఈ విషయంలో విశాల్ పైనే పూర్తిగా ఆరోపణలు రావడానికి కారణం కూడా లేకపోలేదు. ఆ జూ. ఆర్టిస్టు ఆత్మహత్యయత్నానికి ముందు హీరో విశాల్ కి లేఖ రాశాడు.. ప్రస్తుతం ఆ విషయమే పెద్ద వివాదంగా మారింది. దాదాపు 40 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన అతనికి పారితోషికం సక్రమంగా అందలేదని, అందుకే అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని సహ జూనియర్ ఆరిస్టులు వాదిస్తున్నారు. మరోవైపు జూ. ఆర్టిస్టు సెల్వరాజ్ - ఆయన భార్య శశికళతో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ దంపతులు విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి సెల్వరాజ్ ఆత్మహత్యకు యత్నించారు. అతని నోటి నుండి నురగ రావడం గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్సలందించిన వైద్యులు సెల్వరాజ్ ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు.
అయితే.. ఈ విషయం తెలిసుకున జూనియర్ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాటి కళాకారులను ఆదుకుంటామని హామీ ఇవ్వబట్టే తాము విశాల్ టీమ్ ను గెలిపించామని.. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత నడిగర్ సంఘం నిర్వాహకుల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విశాల్ మంటగలిపారని ఆరోపించారు.ఇప్పటికైనా నడిగర్ సంఘం ఈ విషయాలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు!