300కోట్ల గిఫ్ట్.. ఇదీ తెలుగోడి స‌త్తా!

Update: 2019-07-15 14:00 GMT
ఖాన్ ల త్ర‌యంలో స‌ల్మాన్ ఖాన్ మిన‌హా అమీర్ - షారూక్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలిసిందే. షారూక్ కి రెండేళ్లుగా అస‌లు స‌క్సెస్ లేక బాక్సాఫీస్ వ‌ద్ద‌ 100 కోట్లు తేవ‌డ‌మే గ‌గ‌నంగా మారింది. అమీర్ ఖాన్ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` ఫెయిల్యూర్ తో ఇప్ప‌టివ‌ర‌కూ ఏం చేయాలో ఆలోచించుకోవ‌డానికే స‌రిపోయింది. ప్ర‌స్తుతం అత‌డు ఓ రీమేక్ సినిమాలో న‌టిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో స‌ల్మాన్ - అక్ష‌య్ లాంటి హీరోలు హిందీ బాక్సాఫీస్ ని ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. యంగ్ హీరోల్లో ర‌ణవీర్ సింగ్ ఎదురే లేకుండా స‌త్తా చాటుతూ ఇంతింతై అన్న చందంగా ఎదుగుతున్నాడు.

అయితే ర‌ణ‌వీర్ కంటే సీనియ‌ర్ అయిన షాహిద్ క‌పూర్ మాత్రం మ‌ల్టీస్టార‌ర్లు చేస్తూ కాలం సాగిస్తున్న టైమ్ లో ఇత‌ర స్టార్ హీరోల‌కు ధీటుగా `ఇదిరా సోలో స‌క్సెస్` అనేంత‌గా `క‌బీర్ సింగ్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని కానుక‌గా ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్  ర‌క‌ర‌కాల వివాదాల న‌డుమ బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత వ‌సూళ్ల‌ను సాధించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. షాహిద్ కెరీర్ లోనే తొలి సోలో 200కోట్ల క్ల‌బ్ చిత్ర‌మిది. ఈ సినిమా నాలుగు వారాలు అద్భుత వ‌సూళ్లతో అద‌ర‌గొట్టి ఐదో వారంలోకి అడుగు పెట్టింది. కేవ‌లం 28 రోజుల్లో ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వ‌ద్ద 260 కోట్లు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 300 కోట్లు పైగా వ‌సూలు చేసింది.

క‌బీర్ సింగ్ బాక్సాఫీస్ గ‌ణాంకాలు ప‌రిశీలిస్తే.. తొలివారం 134కోట్లు.. రెండో వారం - 79 కోట్లు.. మూడోవారం-37 కోట్లు, నాలుగో వారం- 11 కోట్లతో దేశీయ బాక్సాఫీస్ వద్ద 260 కోట్లు రాబట్టింద‌ని తరణ్ ఆదర్శ్ ట్విట్ట‌ర్ లో వివ‌రాల్ని అందించారు. వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు 300 కోట్ల‌ను అధిగ‌మించాయ‌ని వెల్ల‌డించారు. అమెరికాలో ఈ చిత్రం ఇప్ప‌టికే 12కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఇత‌ర దేశాల‌న్నిటా క‌లుపుకుంటే 35కోట్ల మేర వ‌సూళ్లు ద‌క్కాయి. ఓవ‌రాల్ గా 309 కోట్లు వ‌సూలు చేసింద‌ని త‌ర‌ణ్ తెలిపారు. కబీర్ సింగ్ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా కేవ‌లం రూ.60 కోట్ల బ‌డ్జెట్ తో తెరకెక్కించారు. పెట్టుబ‌డి కంటే ఐదు రెట్లు ఇప్ప‌టికే వ‌సూలైంది. వ‌సూళ్ల దూకుడు ఇంకా ఇలానే కొన‌సాగితే మ‌రో 50 కోట్ల‌తో 350 కోట్లు వ‌సూలు చేస్తుందా.. అన్న‌ది చూడాలి. హిందీ బాక్సాఫీస్ కి.. షాహిద్ కి ఒక తెలుగు కుర్రాడు ఇచ్చిన అరుదైన‌ కానుక ఇద‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News