‘క‌హానీ’ చెబుతున్న.. హీరోయిన్లు, హీరోలు!

Update: 2021-07-08 23:30 GMT
‘‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. వాళ్లంతా వేట‌కెళ్లీ...’’ అని కథలు చెప్పేందుకు సిద్ధమయ్యారు సినిమా హీరోయిన్లు, హీరోలు. అయితే.. వాళ్లు మ‌న తెలుగు న‌టీన‌టులు కాదు. హాలీవుడ్ స్టార్స్. వాళ్లేంటీ..? క‌థ‌లు చెప్ప‌డ‌మేంటీ? అనుకుంటున్నారా?.. ఆ వివ‌రాలేంటో చూడండి.

ఓ ముప్పై ఏళ్లు వెన‌క్కిపోతే.. సాయంత్రం వేళ అంద‌రి ఇళ్ల‌లోనూ వృద్ధులు పిల్ల‌ల‌కు క‌థ‌లు చెప్పేవారు. ప‌డుకునే ముందు ఖ‌చ్చితంగా స్టోరీ చెప్పాల్సిందే. లేదంటే.. పిల్ల‌లు నిద్ర‌పోయేవారు కాదు. ఆ విధంగా చెప్పే క‌థ‌ల ద్వారా వాళ్ల‌కు కాల‌క్షేపంతోపాటు మంచి అవ‌గాహ‌న కూడా ఏర్ప‌డేది. కానీ.. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు మొత్తం మారిపోయాయి.

ప్ర‌ధానంగా టీవీలు ఇళ్ల‌లోకి వ‌చ్చేసిన త‌ర్వాత.. క‌థ‌లు చెప్ప‌డం అనేది దాదాపుగా క‌నుమరుగైపోయింది. మ‌న‌ద‌గ్గ‌రే కాదు.. ప్ర‌పంచం మొత్తం ఇదే ప‌రిస్థితి. సాయంత్రం ఆరు, ఏడు గంట‌లు కాగానే.. పూత‌రేకులు, ఇస్తారాకులు, మొగిలి రేకులు అంటూ.. సీరియ‌ళ్లు చూడ‌డం మొద‌లు పెట్టారు. దాంతో.. పిల్ల‌ల్లో జిజ్ఞాస రేకెత్తించే క‌థ‌లు వారికి అంద‌కుండాపోయాయి. ఇక‌, ఈ ప‌రిస్థితి ఎవ్వ‌రూ మార్చ‌లేని స్థాయికి వ‌చ్చేసింది.

అయితే.. టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటూనే.. పిల్ల‌ల‌కు క‌థ‌లు చెప్పించాల‌నే వినూత్న‌మైన ఆలోచ‌న చేసింది ఓ ఆన్ లైన్ వెబ్ సైట్‌. దాని పేరు ‘ఆడిబుల్ డాట్ ఇన్‌’. అయితే.. ఎవ‌రో సాధార‌ణ వ్య‌క్తులు చెబితే ఎవ‌రు వింటారు? అనుకుందో ఏమో.. సినిమా స్టార్ల‌ను రంగంలోకి దింపింది. ఇందులో టైటానిక్ బ్యూటీ కేట్ విన్ స్లెట్‌, స్కార్లెట్ మోహాన్సన్, రేచ‌ల్ మెక్ యాడ‌మ్స్‌, హ్యూలారీ ఉన్నారు. మ‌రి, మీరు కూడా ఈ క‌థ‌లు వినాలంటే.. జ‌స్ట్ లాగిన్ టూ ‘ఆడిబుల్ డాట్ ఇన్‌’.
Tags:    

Similar News