చిరు అల్లుడికి అంత డిమాండా?

Update: 2018-06-25 08:19 GMT
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రం చేయబోతున్నాడు. చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. శ్రీజతో పెళ్లి సమయంలో కళ్యాణ్ లుక్స్ చూసినపుడే ఇతను కూడా హీరో అవుతాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అనుకున్నట్లే అతడికి కూడా నటనపై ఆశ పుట్టింది. హీరో అయిపోయాడు. సినిమా మొదలైపోయింది. విడుదలకు కూడా సిద్ధమైపోయింది. సాయి కొర్రపాటి లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తే.. రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఈ కాంబినేషన్ ఎలా సెట్టయిందన్నది ఎవరికీ తెలియదు.

కానీ ‘విజేత’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం దర్శక నిర్మాతలిద్దరూ చిరు అల్లుడిని వెతుక్కుంటూ వచ్చినట్లుగా చెప్పుకున్నారు. ముందుగా కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. తాను వైజాగ్ సత్యానంద్ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకుని వచ్చిన వెంటనే రాకేశ్ శశి వచ్చి తనకు కథ చెప్పినట్లు వెల్లడించాడు. ఆపై చిరంజీవి మాట్లాడుతూ.. కళ్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేస్తానంటూ సాయి కొర్రపాటి ముందుకొచ్చినట్లు చెప్పాడు. కానీ చిరు.. అల్లు కుటుంబాలకు చెందిన వాళ్లయితే దర్శక నిర్మాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నా ఒక అర్థం ఉంది. కానీ బయటి ఫ్యామిలీ నుంచి వచ్చిన కళ్యాణ్ కోసం దర్శక నిర్మాతలు వాళ్లంతట వాళ్లుగా వచ్చి కలిశారంటే ఆశ్చర్యపోవాల్సిందే. అందులోనూ సాయికొర్రపాటి లాంటి పెద్ద నిర్మాత ఇలా చేశాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.సెంథిల్ కుమార్ లాంటి ఖరీదైన కెమెరామన్ ను పెట్టుకోవడం.. ఇంకా కొందరు పేరున్న టెక్నీషియన్లను తీసుకుని మంచి క్వాలిటీతో సినిమా తీయడాన్ని చూస్తే చిరు నుంచో.. కళ్యాణ్ కుటుంబం నుంచో బ్యాకప్ లేకుండా ఉంటుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. సాయికి ఉన్న బ్రాండ్ వాల్యూ దృష్ట్యా ఈ సినిమా ప్రపోజల్ కూడా ఎటు వైపు నుంచి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.
Tags:    

Similar News