రొమాంటిక్ కథలు మన ఒంటికి పడవబ్బా !

Update: 2022-08-05 04:27 GMT
జీవితంలో ఏ విషయంలోనైనా ప్రయత్నమో .. ప్రయోగమో చేస్తూ వెళ్లవలసిందే. అప్పుడే ఏది ఫలిస్తుందో .. ఏది వికటిస్తుందో  .. అసలు మనం దేనికి పనికి వస్తామో అని విషయంలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తనకి ఆ క్లారిటీ వచ్చేసిందని కల్యాణ్ రామ్ చెప్పాడు. ఇంతకీ ఆయన చెప్పిన మాటేంటంటే .. ఇకపై రొమాంటిక్ కథల జోలికి వెళ్లనని. అందుకు కారణం ఆయనకి ఎదురైన అనుభవమే. కల్యాణ్ రామ్ చూడటానికి మంచి హైటూ .. పర్సనాలిటీతో  ఆకర్షణీయమైన రూపంతో  ఉంటాడు. ఒక హీరోకి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి.

అయితే కల్యాణ్ రామ్ కాస్త రఫ్ గా కనిపిస్తాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే అనిపిస్తుంది. అందువలన ప్రేమకథలకు ఆయన సెట్ కాలేదు. ప్రేమకథలకు కవసలసిన సాఫ్ట్ లుక్ కీ .. సున్నితమైన భావోద్వేగాలకు ఆయన కాస్త దూరంగా కనిపిస్తాడు. అందువలన హీరోగా తాను చేసిన 'తొలిచూపులోనే' .. 'అభిమన్యు' సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఆ తరువాత చేసిన 'నా నువ్వే' అనే రొమాంటిక్ సినిమా కూడా ఘోరంగా దెబ్బతింది.  ప్రేమకథల్లో తనని జనం చూసే పరిస్థితి లేదనే విషయం ఆయనకి అర్థమైపోయింది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో మరోసారి ఆడియన్స్ ను మెప్పించడానికి 'ఎంతమంచివాడవురా' సినిమాతో ఆయన చేసిన  ప్రయత్నం కూడా ఫలించలేదు. తాను సాఫ్ట్ రోల్స్ చేస్తే వర్కౌట్  కావడం లేదనే విషయం ఆయనకి స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన 'బింబిసార' సినిమాను చేశాడు. ఇది సోషియో ఫాంటసీ క్రిందికి వస్తుందనే చెప్పాలి.

ఈ సినిమాలో హీరో ఆయనే .. విలన్ ఆయనే. డిఫరెంట్ గా ట్రై చేయడం వలన ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. తనకి అచ్చిరాని లవ్ .. రొమాన్స్ కథల జోలికి ఇకపై వెళ్లననీ .. యాక్షన్ తో కూడిన 'బింబిసార' తరహా ప్రయోగాలు చేస్తూ వెళతానని కల్యాణ్ రామ్ చెప్పాడు.

ఎన్టీఆర్ సినిమాకి ఒక నిర్మాతగా తాను రెడీ అవుతున్నానని ఆయన అన్నాడు. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత వచ్చే ఎన్టీఆర్   సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయనీ , అందువలన ఆ స్థాయి అంచనాలను అందుకోగలిగే ప్రాజెక్టును సెట్ చేయడానికి కొంతసమయం పడుతుందని చెప్పాడు.

ఇక గతంలో తన బ్యానర్లో బాలయ్య బాబాయ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తే కుదరలేదనీ, త్వరలో ఆయనతో ఒక సినిమా తప్పకుండా ఉంటుందని అన్నాడు. ఆయన కోసం మంచి కథను వెతికే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చాడు. మరి ఆ సినిమాలో తాను కూడా నటించి ముచ్చట తీర్చుకుంటాడా లేదా అనేది చూడాలి.
Tags:    

Similar News