కళ్యాణ్ రామ్ సినిమా మళ్లీ..?

Update: 2018-05-25 16:26 GMT
ఏంటో పాపం.. నందమూరి కళ్యాణ్ రామ్ కు అస్సలు టైం కలిసి రావడం లేదు. ఓవైపు హ్యాట్రిక్ ఫ్లాపులు కళ్యాణ్ రామ్ ను డీలా పడిపోయేలా చేయగా.. మరోవైపు అతడి కొత్త సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.  కళ్యాణ్ రామ్-తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’ చిత్రాన్ని మొదట మే 25నే ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల జూన్ 1కి వాయిదా వేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం జూన్ 1న కూడా ఈ చిత్రం విడుదల కాదట. జూన్ 8 లేదా జూన్ 14న రిలీజ్ చేయాలని చూస్తున్నారని తెలిసింది.

ఇందుకు కారణాలేంటో తెలియడం లేదు. సెన్సార్ కూడా అయిన సినిమా ఇలా మళ్లీ మళ్లీ ఎందుకు వాయిదా పడుతోందో? జూన్ 1న ‘ఆఫీసర్’.. ‘అభిమన్యుడు’.. ‘రాజుగాడు’ రాబోతుండటంతో పోటీ ఎక్కువైందని ఇలా చేశారేమో అనుకుంటే.. తర్వాత వారాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జూన్ 2వ వారంలో ‘కాలా’తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘జురాసిక్ వరల్డ్’ రాబోతున్నాయి. జూన్ 14వ తేదీకి ‘సాక్ష్యం’.. ‘సమ్మోహనం’.. ‘టాక్సీవాలా’ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. మరి ఇంత పోటీలో ‘నా నువ్వే’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.   ‘180’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జయేంద్ర డైరెక్షన్లో ‘నా నువ్వే’ చేశాడు నందమూరి హీరో. తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా.. క్లాస్ గాకళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు ఇందులో.


Tags:    

Similar News