కమల్ హాసన్.. జయలలితను వదల్లేదు

Update: 2017-03-14 07:03 GMT
కొందరి మీద కోపం వాళ్లు చనిపోయినా పోదనడానికి తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ మాటలే నిదర్శనం. ఆయనకు.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే పడదన్న సంగతి తెలిసిందే. కమల్ ఓ సందర్భంగా పంచె కట్టినవాడే ప్రధాని కావాలి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఆయనపై జయలలిత కక్షగట్టి ‘విశ్వరూపం’ సినిమాకు బ్రేక్ వేసిందని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. ‘విశ్వరూపం’ విడుదల ఆగిపోయినపుడు కమల్ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలా ఎమోషనల్ అయిపోయాడు. దేశం వదిలి వెళ్లిపోతానన్నట్లు మాట్లాడాడు. అప్పటికి ఆ వ్యవహారం ఎలాగోలా సమసిపోయింది కానీ.. కమల్‌ కు మాత్రం జయ మీద ఉన్న కోపం ఆమె మరణానంతరం కూడా తగ్గినట్లు లేదు.

తాజాగా ఒక తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో జయను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించాడు కమల్. ‘విశ్వరూపం’ సినిమా విడుదలకు ముందు.. తర్వాత చోటుచేసుకున్న పరిణామాలకు కారణం ఇస్లాం వర్గం కాదని.. రాజకీయ నాయకులేనని స్పష్టం చేశాడు కమల్. అప్పట్లో అధికారంలో ఉన్నవాళ్లే ‘విశ్వరూపం’ విడుదల కాకుండా అడ్డుకున్నారని పరోక్షంగా నాటి సీఎం జయలలితపై ఆరోపణలు గుప్పించాడు కమల్. ఇక ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం మీదా కమల్ విమర్శలు కొనసాగించాడు. ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదని.. కాబట్టి వెంటనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. బయటికి చెప్పకున్నా.. జయ మరణానంతరం పన్నీర్ సెల్వమే అధికారంలో కొనసాగాలని కమల్ కోరుకున్నారు. శశికళ వర్గీయుడైన పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం ఆయనకు ఎంతమాత్రం రుచించలేదు. రాజకీయాల్లోకి వస్తారా అని కమల్ ను ప్రశ్నిస్తే.. తాను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతానని.. అవే రాజకీయ వ్యాఖ్యలుగా మారాయని.. భవిష్యత్తు రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే ఇంకా మాట్లాడుతూనే.. ప్రశ్నిస్తూనే ఉంటానని కమల్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News