క‌మ‌ల్ సంయ‌మ‌న‌మే ఇప్పుడు అవ‌స‌రం

Update: 2015-11-03 14:28 GMT
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వివాదాస్ప‌ద అంశాల  మీద పెద‌వి విప్ప‌టం అంటే.. నిప్పులో చేయి పెట్ట‌ట‌మే. అందులోకి సెల‌బ్రిటీల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బంది. దేశాన్ని అట్టుడికిస్తున్న మ‌త స‌హ‌నం అంశం మీద మాట్లాడిన వారంతా వివాదాస్ప‌దుల‌య్యారు. ఎవ‌రో ఒక‌రి విమ‌ర్శ‌ల‌కు బ‌ల‌య్యారు. అంతేకానీ.. ఎవ‌రూ ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కుండా ఉన్న‌ది లేదు.

చివ‌ర‌కు కింగ్‌ ఖాన్‌ గా చెప్పే బాలీవుడ్ బాద్షా షారూక్ సైతం మ‌త‌స‌హ‌నం నానాటికీ త‌గ్గుతుంద‌న్న అంశం మీద మాట్లాడి వివాదాస్ప‌దం కావ‌ట‌మే కాదు.. వీహెచ్‌ పీ నేత‌ల్లాంటి వారు అయితే.. షారూక్ ను దేశం నుంచి వెళ్లిపోవాల‌న్న మాట కూడా అనేశారు. అత్యుత్త‌మ స్థాయిలో కీర్తి ప్ర‌తిష్ట‌లు అందుకుంటున్న ఒక వ్య‌క్తిని నువ్వీ దేశంలో ఉండ‌టానికి అర్హ‌త లేదంటే అగ్ర‌హ‌మే కాదు.. ఆవేశం కూడా వ‌స్తుంది. కానీ.. ఇక్క‌డ స‌మ‌స్య ఇరు వ‌ర్గాల మ‌ద్య భావోద్వేగానికి సంబంధించింది.

ఇలాంటి అంశాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేయాలే కానీ.. తాము మాట్లాడే మాట‌ల‌తో మ‌రింత మంట‌లు పుట్టే ప‌ని చేయ‌కూడ‌దు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇప్ప‌టివ‌ర‌కూ ఈ అంశం మీద మాట్లాడిన మేధావులు.. క‌వులు.. క‌ళాకారులు.. సెల‌బ్రిటీలు అంతా కూడా ఒకే తీరును ప్ర‌ద‌ర్శించారు. కానీ.. వీరికి భిన్నంగా క‌మ‌ల్ హాస‌న్ స్పందించారు.

ఆచితూచి మాట్లాడ‌ట‌మే కాదు.. ప‌రిణతితో మాట్లాడి అంద‌రి మ‌న‌సులు దోచుకున్నంత ప‌ని చేశారు. సున్నిత‌మైన అంశం ప‌ట్ల ఎలా స్పందించాలి..?ఎలా రియాక్ట్ కావాలి?అన్న విష‌యాన్ని చేత‌ల్లో చేసి చూపించారు.

క‌వులు..క‌ళాకారులు త‌మ‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన పుర‌స్కారాల్ని వెన‌క్కి ఇచ్చేయ‌టం అన్న మాట చెబితే ఒక వ‌ర్గానికి కోపం.. అలా కాదంటే మ‌రో వ‌ర్గానికి మంట‌. కానీ.. తాను ప్ర‌భుత్వం ఇచ్చిన పుర‌స్కారాల్ని ఇవ్వ‌న‌ని చెబుతూనే.. అంద‌రిని ఆలోచింప చేసేలా మాట్లాడి కొత్త కోణాన్ని ఆవిష్క‌రించారు క‌మ‌ల్ హాస‌న్‌.

విల‌క్ష‌ణ న‌టుడ‌న్న పేరుకు త‌గ్గ‌ట్లే విల‌క్ష‌ణంగా మాట్లాడి స‌ల‌క్ష‌ణంగా ఈ వివాదాస్ప‌ద మంట‌ల నుంచి ఎలాంటి గాయాలు కాకుండా బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెప్పాలి. ఇంత‌కీ క‌మ‌ల్ చెప్పిందేమిటన్న‌ది సింఫుల్ గా చెబితే.. మ‌త స‌హ‌నం త‌గ్గ‌టం దేశానికి మంచిది కాదు.. గ‌తంలో అలాంటిదే జ‌రిగి దేశం విభ‌జ‌న‌కు గురైంది. అదే జ‌ర‌గ‌క ఉంటే చైనానే మించిపోయేది. అందుకే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి మ‌రోసారి రాకూడ‌ద‌ని చెప్పారు.

ఈ మాట‌ల ద్వారా దేశంలో నెల‌కొన్న వాతావ‌ర‌ణం దేశానికి మంచిది కాద‌న్న మాట‌ను ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పేశారు. అదే స‌మ‌యంలో గ‌తంలో ఇచ్చిన పుర‌స్కారాల్ని తిరిగి ఇచ్చేస్తారా? అంటే.. అస‌లు ఎందుకు ఇవ్వాలంటూ ఎదురు ప్ర‌శ్నించి.. పుర‌స్కారాలు తిరిగి ఇచ్చినంత‌మాత్రాన ప‌రిస్థితుల్లో మార్పు రాద‌ని.. నిజంగా మార్పు తీసుకురావ‌టానికి చాలానే ప‌ద్ధ‌తులు ఉన్నాయ‌ని చెప్పారు. అంతేకాదు.. పుర‌స్క‌రాలు తిరిగి ఇవ్వ‌టం ద్వారా ప్ర‌భుత్వాన్ని.. ప్ర‌జ‌ల్ని అవ‌మానించిన‌ట్లు అవుతుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పేశారు.

నిజాయితీగా స‌మ‌స్య మీద అగ్ర‌హం ఉంటే.. ఆ స‌మ‌స్య‌ను మ‌రింత బ‌లంగా ముందుకు తీసుకెళ్లాలంటే అనుస‌రించే ప‌ద్ధ‌తి పుర‌స్కారాల్ని తిరిగి ఇవ్వ‌టం ఎంత‌మాత్రం కాద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం ద్వారా.. రెండు వ‌ర్గాల మ‌ధ్య మ‌ధ్యేమార్గాన్ని సూచించి వైనం ప‌లువుర్ని ఆక‌ట్టుకుంటుంద‌నే చెప్పాలి. గొడ‌వ మంచిది కాదు. అదే స‌మ‌యంలో గొడ‌వ‌ను రాజేసే వైఖ‌రి ఏమాత్రం స‌రి కాద‌న్న ధోర‌ణి క‌మ‌ల్ మాట‌ల్లో క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సెల‌బ్రిటీలు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తే ఎలా ఉంటుంద‌న‌టానికి క‌మ‌ల్ ఒక ఉదాహ‌ర‌ణ‌. అంద‌రూ అలానే వ్య‌వ‌హ‌రిస్తే.. ఇప్పుడున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొన‌టం అంత క‌ష్టం కాదేమో..?

Tags:    

Similar News