క‌మ‌ల్ హాస‌న్ చేయాల్సిన‌ది..

Update: 2019-07-16 17:30 GMT
భార‌తదేశంలో ప్ర‌యోగాలు చేయ‌డంలో నంబ‌ర్ వ‌న్ హీరోగా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కి పేరుంది. సౌత్ ఇండ‌స్ట్రీలో ఆయ‌న త‌ర్వాత చియాన్ విక్ర‌మ్ కే ఆ ఐడెంటిటీ ఉంది. శివ‌పుత్రుడు- అప‌రిచితుడు- నాన్న‌ లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో మెప్పించారు విక్ర‌మ్. అందుకే క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి వెళుతూ  త‌న వార‌సుడిగా భావించి చియాన్ విక్ర‌మ్ కి ఓ క్యారెక్టర్ లో న‌టించాల్సిందిగా కోరార‌ట‌. ఆ సంగతిని నేడు హైద‌రాబాద్ లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో విక్ర‌మ్ స్వ‌యంగా వెళ్ల‌డించారు.

విక్ర‌మ్ న‌టించిన తాజా చిత్రం `మిస్ట‌ర్ కేకే` ఈనెల 19న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మీడియా ఇంట‌రాక్ష‌న్ లో మాట్లాడుతూ విక్ర‌మ్ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని తెలిపారు. ``మిస్ట‌ర్ కేకే అంత‌ర్జాతీయ స్థాయిలో తెర‌కెక్కిన సినిమా. నా కెరీర్ లో ఒకానొక బెస్ట్ రోల్ చేశాను. అది పాజిటివా? నెగ‌టివా? అని ముందే పసిగ‌ట్ట‌డం ప్రేక్ష‌కుడికి వీలుకాదు. ప్ర‌తినాయ‌క ఛాయ‌లు ఉండే పాత్రలో న‌టించాను. రేపు సినిమా చూస్తుంటే ఆ పాత్ర‌లో బ‌లం ఏంటో మీకే అర్థ‌మ‌వుతుంది`` అన్నారు. హాలీవుడ్ స్ఫూర్తి ఉందా? అని ప్ర‌శ్నిస్తే.. ఒక ఆంగ్ల సినిమా త‌ర‌హా చేసి చాలా కాల‌మైంది. స్టైల్ .. న‌ట‌న ప్ర‌తిదీ చాలా కొత్తగా కుదిరాయి. అలాగే ఫైట్స్ ఎంతో రియ‌లిస్టిక్ గా ఉంటాయి. ఫ్రాన్స్ కి చెందిన ఫైట్ కొరియోగ్రాఫ‌ర్ గిల్ రియ‌ల్‌గా ఉండేలా యాక్ష‌న్ ను తెర‌కెక్కించారు. ఒక‌రోజులో జ‌రిగే క‌థ కాబ‌ట్టి.. సినిమా ఫాస్ట్ ఫేజ్‌లో ర‌న్ అవుతుంది. ఆద్యంతం ఒక హాలీవుడ్ సినిమాని చూస్తున్నామా? అన్న ఫీలింగ్ క‌లుగుతుంది అని తెలిపారు.

వాస్త‌వానికి ఈ సినిమాని క‌మ‌ల్ హాస‌న్ చేయాల్సింది. కానీ ఆయ‌న రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల చేయ‌లేక‌పోయార‌ని.. ఆ త‌ర్వాత ఆ ఛాన్స్ త‌న‌కు ఇచ్చార‌ని విక్ర‌మ్ వెల్ల‌డించారు. ఈ సినిమాలో నా న‌ట‌న చూసి గుడ్ జాబ్ అని పొగిడితే చాల‌ని అనుకున్నా. వాస్తవంగా క‌మ‌ల్‌సార్ ఎవ‌రి గురించి పెద్ద‌గా మాట్లాడ‌రు. కానీ ఈ సినిమా ఆడియో  వేడుక‌లో నా గురించి.. నేను న‌టించిన తీరు పైనా ఆయ‌న‌ మాట్లాడిన తీరు చూసి క‌ళ్లు చెమ‌ర్చాయి.. అని విక్ర‌మ్ ఆనందం వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News