ఆ స్టార్ హీరో కలల ప్రాజెక్ట్.. ఆగిపోయినట్లే!

Update: 2020-05-04 10:10 GMT
కరోనా సమయంలో ప్రజలందరిని అప్రమత్తం చేసేందుకు విశ్వనటుడు కమల్ హాసన్ స్వయంగా పాట రాసి పాడారు. అంతేకాదు ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పటికే చాలాసార్లు ఆయన సూచించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా లోకనాయకుడు కమల్‌హాసన్, స్టార్ హీరో విజయ్‌ సేతుపతి లైవ్‌ ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. సినీ పరిశ్రమలలో తమ అనుభవాలను ఇరువురు తమ అభిమానులతో పంచుకున్నారు. ఆ సందర్భంగా ఆహారం విష‌యంలో తనను తాను నియంత్రించుకోలేనని, తనకు నచ్చిన ఆహారం తింటానని చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. 90ల్లో సంచలన ప్రాజెక్టుగా నిలిచిన ‘మరుదనాయగం’ ప్రస్తావనను విజయ్‌ సేతుపతి తీసుకొచ్చారు.

అందుకు కమల్‌ బదులిస్తూ, ‘మరుదనాయగం’కు భారీ బడ్జెట్‌ అవసరమవుతుందని, ముఖ్యంగా తాను ‘మరుదనాయగం’ కథ రాస్తున్నప్పుడు 40 ఏళ్ల వ్యక్తిలా ఆలోచించానని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే కథ మార్పులు చేయాలని లేదంటే మరో హీరోతో తెరకెక్కించాల్సి వుంటుందని పేర్కొన్నారు. నిజానికి కమల్ హాసన్ కలల సినిమా ‘మరుదనాయగం’ గురించి ఒకప్పుడు పెద్ద చర్చే నడిచింది. 90ల చివర్లో క్వీన్ ఎలిజబెత్‌-2ను ఇండియాకు రప్పించి ఆమె చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిపించాడు. ఆ తర్వాత కొంత కాలం షూటింగ్ చేసి.. మధ్యలో బడ్జెట్ సమస్యలతో ఆపేశాడు కమల్. ఆ తర్వాత ఈ సినిమాను మళ్లీ మొదలుపెడతానని.. పూర్తి చేస్తానని చాలాసార్లు చెప్పాడు. కానీ ఇప్పట్లో మరుదనాయగం సినిమా తీయాలంటే 500కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు కమల్. ఇక ఈ కలల సినిమా లేనట్లే అని అర్ధమవుతుంది.
Tags:    

Similar News