'నన్ను హరామ్ ఖోర్ అని తిట్టినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావ్.. కానీ నేను అలా ఉండలేను'

Update: 2020-09-26 13:00 GMT
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కింగ్స్ XI పంజాబ్‌ vs ఆర్సీబీ ఐపీయల్ మ్యాచ్‌‌ లో కోహ్లి వైఫల్యంపై చేసిన కామెంట్ చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. సన్నీ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ బీసీసీఐ అతడిని కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఇక కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ గావస్కర్‌ కు ఘాటుగా రిప్లై ఇచ్చింది. ''మీ మెసేజ్ అగౌరవపర్చేలా ఉంది. భర్త ఆటకు భార్యపై ఆరోపణలు చేస్తారా? చాలా ఏళ్లుగా క్రికెట్ కామెంట్రీ చెబుతున్న మీరు.. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించి ఉంటారు. నాకు, కోహ్లికి కూడా ఇలాగే గౌరవం ఇవ్వాలని మీరు భావించలేదా? మీరో లెజెండ్.. క్రికెట్లో మీరెంతో ఖ్యాతిని పొందారు. మీరు ఇలా చెప్పడం వినగానే నాకెంతో బాధేసిందని చెప్పాలనుకుంటున్నా'' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. అయితే దీనికి సన్నీ స్పందిస్తూ తన కామెంట్స్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. తాను ఎవరినీ విమర్శించలేదని.. లింగ వివక్ష వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు.

ఈ వివాదం ముగిసిందిలే అనుకుంటుండగా.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎంటరై అనుశ్క శర్మ పట్ల సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను ట్విటర్ వేదికగా ఖండించింది.

సునీల్ గవాస్కర్ క్రికెట్‌ వ్యవహారాల్లోకి అనుష్కను లాగడం ముమ్మాటికి తప్పే అని.. అలాగే ఇది సెలెక్టివ్ ఫెమినిజం కూడా మంచిది కాదని అనుష్క‌ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. తనకు బెదిరింపులు వచ్చినప్పుడు, హరామ్ ఖోర్ అని తిట్టినప్పుడు అనుష్క మౌనంగా ఉండిపోయిందని.. కానీ తాను అలా ఉండలేనని పేర్కొంది. ''నన్ను బెదిరించినప్పుడు, హరామ్ ఖోర్ అని అన్నప్పుడు అనుష్క మౌనంగా ఉంది. కానీ ఈ రోజు ఆమె నాలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. సునీల్ గవాస్కర్ అనుష్క ను క్రికెట్‌‌ లోకి లాగడాన్ని ఖండిస్తున్నా. కానీ ఈ సెలెక్టివ్ ఫెమినిజం తీరును కూడా తప్పుబడుతున్నా'' అని ట్వీట్ చేసింది కంగనా. అంతేకాకుండా ''లైంగిక కాంక్షతో రగిలిపోతున్న వారికే సునీల్ గావస్కర్ వ్యాఖ్యల్లో డబుల్ మీనింగ్ కామెంట్స్ వినిపిస్తాయి. గవాస్కర్ కూడా అక్కడ అనుష్క పేరును ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ అనుష్క క్రికెటర్‌ పాత్ర పోషిస్తుంది. తన భర్తతో కలిసి ప్రాక్టీస్ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి'' అని కంగనా మరో ట్వీట్ చేసింది.
Full View
Tags:    

Similar News