రియాపై ఫైటింగుకి సుశాంత్ సింగ్ సోద‌రితో కంగ‌న కుమ్మ‌క్కు..!?

Update: 2020-08-28 01:30 GMT
శ‌త్రువుకి శ‌త్రువు మిత్రుడు! అన్న చందంగా సుశాంత్ సింగ్ సోద‌రితో కంగ‌న కుమ్మ‌క్కు అయ్యిందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. సుశాంత్ సింగ్ మ‌ర‌ణానికి రియా చ‌క్ర‌వ‌ర్తి వెన‌క ఉన్న ఒక పెద్ద మ‌నిషి (మ‌హేష్ భ‌ట్) ఆయ‌న స్నేహితులు కార‌ణ‌మ‌ని కంగ‌న తొలి నుంచీ వాదిస్తోంది. సీబీఐ ద‌ర్యాప్తును కోరింది వీళ్లంద‌రిపైనా. ఇప్పుడు రియాకి త‌న వెన‌క ఉన్న బ‌ల‌గానికి సుశాంత్ సింగ్ సోద‌రి శ‌త్రువు. కాబ‌ట్టి త‌న శ‌త్రువు కి శ‌త్రువు మిత్రురాలిగా మారిందా? అన్న‌ది అటుంచితే.. ఇప్పుడు కంగ‌న‌- శ్వేతాసింగ్ కీర్తి క‌లిసి జాయింట్ గా ఈ వివాదంలో పోరాటం సాగించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుడి కోసం సోషల్ మీడియాలో పోరుకు నాయకత్వం వహిస్తున్నారు. దర్యాప్తులో నార్కోటిక్స్ బ్యూరోకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న కీర్తి సింగ్ కంగనా రనౌత్ కు రక్షణ కల్పించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని.. పీఎంవో కార్యాలయాన్ని కోరారు. మేం ఇరువురం ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో పరిశోధనకు సహాయం చేస్తామ‌ని సుశాంత్ సోద‌రి వ్యాఖ్యానించారు.

తన సోదరుడి కేసులో నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ‘ఇంత దారుణమైన నేరానికి పాల్పడిన వ్యక్తులు ... జాలి లేని వారిని ఎందుకు వ‌దిలేస్తారో నాకు సమాధానం కావాలి !! వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి !! #ArrestCulpritsOfSSR  అంటూ కీర్తి సింగ్ ప్ర‌చారం చేస్తున్నారు.

గత రెండు రోజుల్లో ఏమి జరిగిందనే దానిపై సమగ్ర విశ్లేషణను కూడా ఆమె ఇన్ ‌స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది. ``మేం ఇంకా నేరస్థులను అదుపులోకి తీసుకోవడానికి ఎందుక‌ని ఎదురుచూడాలి`` అని శీర్షిక పెట్టారు. #ArrestCulpritsOfSSR #JusticeForSushant అంటూ నిన‌దించారు.

రియా చక్రవర్తి వాట్సాప్ చాట్ రికార్డులను నార్కోటిక్స్ డైరెక్టరేట్ - సిబిఐ- ఎన్‌సిబికి అప్పగించిన తరువాత ఆమెపైనా ఇతరులపైనా కేసు నమోదైంది. అలాగే జూన్ 8 న దివంగత నటుడు సుశాంత్ ఇంటి నుండి బయలుదేరే ముందు రియా ఎనిమిది హార్డ్ డ్రైవ్ లను ధ్వంసం చేసినట్లు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని సిబిఐ ముందు అంగీక‌రించ‌డం సంచ‌ల‌న‌మైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న తన ముంబై అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. ఈ కేసును సీబీఐ సీరియ‌స్ గా ద‌ర్యాప్తు చేస్తోంది.
Tags:    

Similar News