జర్నలిస్టుని వంద కోట్లు కట్టమన్న కమెడియన్

Update: 2018-05-06 06:28 GMT
తమ గురించి ఏ కాస్త నెగెటివ్ వార్త చూసినా తట్టుకోలేకపోతున్నారు సెలబ్రెటీలు.  మీడియాపై చాలా సీరియస్ గా రియాక్టవుతున్నారు. కొందరు విమర్శలతో సరిపెడుతుంటే.. ఇంకొందరు లీగల్ చర్యలకు తయారైపోతున్నారు. టెలివిజన్ కామెడీ షోలతో సినిమా హీరోలతో సమానంగా తిరుగులేని పేరు సంపాదించిన కపిల్ శర్మ కూడా అదే బాట పట్టాడు. అతను తాజాగా ఒక జర్నలిస్టుపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. ఈమేరకు అతడికి లీగల్ నోటీస్ పంపాడు. ఇంతకీ అసలేమైందంటే..

కపిల్ శర్మ కొన్ని రోజుల కిందటే ‘ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ శర్మ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఐతే ఈ కార్యక్రమానికి అతను సమయానికి రావట్లేదట. నిర్వాహకులతో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడట. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు సంపాదించిన ఓ ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ కపిల్ కు వ్యతిరేకంగా వరుసబెట్టి కథనాలు ప్రచురించింది. ఇది కపిల్ కు కాక తెప్పించింది. తన పేరును ఉద్దేశపూర్వకంగా చెడగొట్టేందుకు ఇలాంటి కథనాలు రాస్తున్నారని అతను ఆరోపించాడు.

ఈ కథనాలు రాసిన జర్నలిస్టు వెంటనే తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకుంటే తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.100 కోట్లు కట్టాలని అతను డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఆధారాలు బయటపెట్టకుండా ఉండాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలంటూ ఆ జర్నలిస్టు ముందు తనను బ్లాక్ మెయిల్ చేశాడని కపిల్ ఆరోపించడం గమనార్హం. తాను ప్రస్తుతం తన కార్యక్రమాలకు సంబంధించి ఎంతో కష్టపడుతున్నానని.. జనాల్ని ఎంటర్టైన్ చేయడం తనకెంతో ఇష్టమని.. తాను కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని అతను విజ్ఞప్తి చేశాడు.
Tags:    

Similar News