శ్రీదేవికి ఇచ్చిన మాట కోసం కరణ్‌ జోహార్‌..!

Update: 2018-10-25 07:17 GMT
సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో కూడ స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఆమె అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఆమె లేని లోటును ఆమె కూతురు జాన్వీ కపూర్‌ తీర్చనుందని ‘దఢక్‌’ చిత్రంతో తేలిపోయింది. శ్రీదేవి తన కూతురును స్టార్‌ హీరోయిన్‌ గా చూడాలని కలలు కన్నారు. ఎంతో మంది స్టార్‌ డైరెక్టర్స్‌ మరియు నిర్మాతలు జాన్వీ కపూర్‌ ను పరిచయం చేసేందుకు ముందుకు వచ్చారు. సౌత్‌ నుండి కూడా పలువురు ఫిల్మ్‌ మేకర్స్‌ శ్రీదేవిని సంప్రదించడం జరిగిందట. కాని ఆమె మాత్రం బాలీవుడ్‌ స్టార్స్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ పైనే నమ్మకం పెట్టుకుని ఆయన చేతిలో పెట్టింది.

జాన్వీ కపూర్‌ మొదటి సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మించిన విషయం తెల్సిందే. జాన్వీ మొదటి సినిమా విడుదలకు ముందే శ్రీదేవి అనంత లోకాలకు వెళ్లింది. శ్రీదేవి మరణంకు ముందు - దఢక్‌ చిత్రం ప్రారంభం సమయంలో జాన్వీని స్టార్‌ హీరోయిన్‌ ను చేస్తానంటూ కరణ్‌ జోహార్‌ శ్రీదేవికి మాట ఇచ్చాడట. ఆ మాట ప్రకారమే దఢక్‌ చిత్రంతో వదిలేయకుండా జాన్వీ కపూర్‌ ను వరుసగా తన సినిమాల్లో బుక్‌ చేస్తున్నాడు కరణ్‌ జోహార్‌.

ఇప్పటికే తన బ్యానర్‌ లో రూపొందుతున్న రెండు చిత్రాల్లో హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. ఆ రెండు చిత్రాల్లో ఒకటి బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌ తో తెరకెక్కబోతుంది. యూత్‌ లో వరుణ్‌ కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఆయన సినిమాలో జాన్వీ కపూర్‌ నటిస్తే ఖచ్చితంగా ఆమె కెరీర్‌ కు హెల్ప్‌ అవుతుందని, అలా ఇద్దరు ముగ్గురు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి, ఆ సినిమాలు సక్సెస్‌ అయితే జాన్వీ స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరిపోతుందని కరణ్‌ జోహార్‌ భావిస్తున్నాడట. శ్రీదేవి తరహాలోనే బోణీ కపూర్‌ కూడా తన సొంత బ్యానర్‌ ఉన్నా కూడా కరణ్‌ జోహార్‌ పైనే నమ్మకంతో కూతురును ఆయన చేతిలో పెట్టాడు. శ్రీదేవికి ఇచ్చిన మాట ప్రకారం జాన్వీని స్టార్‌ ని చేసే వరకు కరణ్‌ వదిలి పెట్టకుండా వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడట.
Tags:    

Similar News