రాజమౌళి కాదు.. కీరవాణే మొనగాడు

Update: 2015-07-10 05:37 GMT
బాహుబలి సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి సినిమా విడుదల అయ్యే వరకు వినిపించిన పేరు.. రాజమౌళి. బాహుబలికి తెర మీద కనిపించే హీరో ప్రభాస్‌ అయినప్పటికీ.. సినిమాకు సంబంధించి మొత్తం క్రెడిట్‌ దర్శకుడు రాజమౌళికే వెళ్లింది.

మరి.. పోటుగాడు రాజమౌళి అని సినిమాకు వెళ్లి.. కుర్చీలో కూర్చొని సినిమా స్టార్ట్‌ అయిన తర్వాత నుంచి రాజమౌళితో పాటు.. అతనికి ధీటుగా కనిపించే వ్యక్తి కీరవాణి మాత్రమే. నిజానికి సినిమాల్లో సంగీత దర్శకుడు హీరో వర్షిప్‌ రావటం చాలా అరుదుగా ఉంటుంది.

కానీ.. బాహుబలి సినిమాలో మాత్రం కీరవాణి ముద్ర స్పష్టంగా కనిపించటమే కాదు. బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్‌ కనుక కీరవాణి కాకుండా ఇంకెవరైనా సరే.. బాహుబలిని ఊహించటం కష్టమని చెబుతారు. బాహుబలికి మీడియాలో లభించిన ప్రచారంలో కీరవాణి హైలెట్‌ అయ్యింది అస్సలు లేదు. అందుకు భిన్నంగా సినిమాలో మాత్రం కీరవాణి హైలెట్‌ కావటమే కాదు.. ప్రతి సీన్‌లో ఆయన సంగీతం సినిమాకు పెద్ద అస్సెట్‌గా మారిందని చెబుతున్నారు.

సినిమా పూర్తి అయి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడు తలుచుకునే మొదటి వ్యక్తుల్లో కీరవాణి ఖాయంగా ఉంటాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సినిమా విడుదలయ్యే వరకు పెద్దగా వినిపించని కీరవాణి.. సినిమా విడుదలయ్యాక మాత్రం కీరవాణే సినిమాకు హీరోగా మారిపోవటం. సగటు ప్రేక్షకుడి మాటల్లో చెప్పాలంటే.. బాహుబలి సినిమాకు రాజమౌళి మొనగాడు అనే కంటే.. కీరవాణే అనటం సబబు అన్న మాట వినిపించటం చూస్తే.. ఆయనేం మ్యాజిక్‌ చేశారో ఇట్టే అర్థం అవుతుంది.

Tags:    

Similar News