బిగ్ బాస్ కు సెన్సార్ త‌ప్ప‌దా?

Update: 2019-07-16 11:04 GMT
ఈ వారంలో ప్రారంభం కావాల్సిన బిగ్ బాస్ షో  మీద వివాదం అంత‌కంత‌కూ ముదురుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు న‌టీమ‌ణులు బిగ్ బాస్ మీద తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేయ‌టం.. అవ‌కాశం కోసం క‌మిట్ మెంట్ ఇవ్వాలంటూ స్టార్ మా ప్ర‌తినిధులు కోరిన‌ట్లుగా వారు విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించ‌ట‌మే కాదు.. పోలీసుల‌కు కంప్లైంట్ కూడా చేశారు.

తాజాగా ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టులోనూ వారు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగేలా ద‌ర్శ‌క నిర్మాత కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌న తెలంగాణ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. దీని ప్ర‌కారం ఈ షో ను రాత్రి 11 గంట‌ల త‌ర్వాతే ప్ర‌సారం చేయాల‌ని.. సెన్సార్ చేసిన త‌ర్వాతే టెలికాస్ట్ చేయాల‌న్న ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

అంతేకాదు.. త‌న పిటిష‌న్ లో ఈ షోకు ప్ర‌యోక్త‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న నాగార్జున‌తో స‌హా మ‌రో ప‌ది మందిని ప్ర‌తివాదులుగా చేరుస్తూ కేతిరెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైన బిగ్ బాస్ కోఆర్డినేష‌న్ టీమ్ కూడా హైకోర్టును ఆశ్ర‌యించింది. త‌మపై దాఖ‌లైన బిగ్ బాస్ కేసుల్ని కొట్టివేయాల్సిందిగా కోరారు.

బంజ‌రాహిల్స్.. రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ల‌లో న‌మోదైన ఫిర్యాదుల్ని కొట్టివేయాలంటూ షో నిర్వాహ‌కులు క్వాష్ పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. వీటిపై హైకోర్టు స్పందించాల్సిఉంది. ఒక‌వేళ హైకోర్టు కానీ సెన్సార్ కు ఓకే చెప్పినా.. షోను రాత్రి 11 గంట‌లు దాటిన త‌ర్వాత ప్ర‌సారం చేసినా స్టార్ మాకు భారీ షాకింగ్ గా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News