104 దగ్గర ఔటైన ఖైదీ నెం 150

Update: 2017-02-28 18:23 GMT
అసలు ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టయినర్ తో 100 కోట్లు షేరు వసూలు చేయడం సాధ్యపడుతుందా? షుమారు 150 కోట్లు దాటి గ్రాస్‌ వసూలు చేయడం జరిగే పనేనా? అన్ని సినిమాలకూ కుదురుతుందో లేదో చెప్పలేం కాని.. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి మాత్రం అది సాధ్యపడింది. ఆయన నటించిన ''ఖైదీ నెం 150'' ఇక పూర్తిగా ధియేటర్ల నుండి తప్పుకుంది. మరి ఎన్ని రన్స్ కొట్టాడో చూద్దాం పదండి.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ ఖైదీ ఏకంగా 78+ కోట్లు షేర్ వసూలు చేశాడు. ఆ తరువాత అమెరికాలో అనుకున్నట్లు మిలియన్ డాలర్ల రికార్డుల్లో కాస్త వెనుక బడినా కూడా.. షుమారు 2.5 మిలియన్ డాలర్ల వరకు గ్రాస్ లాగేసి.. ఏకంగా 8.9+ కోట్లు షేర్ వసూలు చేశాడు. విశేషం ఏంటంటే.. అమెరికాలో కంటే కూడా కర్ణాటక నుండి ఈ ఖైదీ నెం 150 .. 9.1+ కోట్లు వసూలే చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా దేశాల నుండి వచ్చిన కలక్షన్లను కలుపుకుంటే.. మొత్తంగా ఖైదీ నెం 150.. 104+ కోట్లు షేరు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే 104 కొట్టే ఔటయ్యాడనమాట.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. రీమేక్ సినిమా అయినప్పటికీ తనదైన పంథాలో కొత్తగా తెరకెక్కించిన వివి వినాయక్ నిజంగానే ఇప్పుడు ఒక మెగా సక్సెస్ సాధించాడని చెప్పాలి. అలాగే నిర్మాతగా రామ్ చరణ్‌ ఆరంగేట్రం కూడా అదిరిపోయింది. ఇక కాజల్ కు కూడా ఎన్నాళ్ళ నుండో రాని ఒక మెగా హిట్ వచ్చేసింది. మొత్తానికి ఖైదీ నెం 150 చిరంజీవి రీ-ఎంట్రీ కూడా అదిరిందంతే.
Tags:    

Similar News