మూవీ రివ్యూ : ఖిలాడి

Update: 2022-02-11 16:53 GMT
చిత్రం : ఖిలాడి

నటీనటులు: రవితేజ-డింపుల్ హయతి-మీనాక్షి చౌదరి-అర్జున్-ముఖేష్ రుషి-అనూప్-మురళీ శర్మ-నిఖితిన్ ధీర్-రావు రమేష్-వెన్నెల కిషోర్-అనసూయ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవన్-జీకే విష్ణు
మాటలు: శ్రీకాంత్ విస్సా
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రమేష్ వర్మ

గత ఏడాది ‘క్రాక్’ భారీ విజయాన్నందుకున్న మాస్ రాజా రవితేజ.. ఇప్పుడు ‘ఖిలాడి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా కారణంగా అనుకున్న దాని కంటే ఆలస్యమైన ఈ చిత్రం ప్రోమోలతో బాగానే ఆసక్తి రేకెత్తించింది. మరి సినిమా ఆ ఆసక్తికి తగ్గట్లుగానే ఉందో లేదో చూద్దాం పదండి.

కథ: గాంధీ (రవితేజ) ఒక అనాథ. అతణ్ని పెంచి పెద్ద చేసిన రాజశేఖర్ (రావు రమేష్) అంటే అతడికి అమితమైన గౌరవం. ఐతే హోం మినిస్టర్ గురుసింగం (ముకేష్ రుషి) సీఎంకు సంబంధించి పది వేల కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించిన డీల్ లో రాజశేఖర్ తో పాటుగా గాంధీ కుటుంబం ఇరుక్కుపోతుంది. ఈ క్రమంలో గాంధీ భార్య.. అత్తమామలు చనిపోతారు. వాళ్లను చంపిన కేసులో ఇరుక్కుని గాంధీ జైలు పాలవుతాడు. అతడి కూతురు దిక్కు లేనిదవుతుంది. ఆ పాపను కాపాడ్డం కోసం సైకాలజీ స్టూడెంట్ అయిన పూజ (మీనాక్షి చౌదరి) కోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి తనకు బెయిల్ వచ్చేలా చేస్తుంది. జైలు నుంచి బయటపడ్డ గాంధీ గురించి నిజ స్వరూపం తెలిసి పూజ షాకవుతుంది. ఇంతకీ అతనెవరు.. తన నేపథ్యమేంటి.. ఈ పది వేల కోట్ల డబ్బుల డీల్ తో అతడికి సంబంధమేంటి.. చివరికీ డబ్బులు ఎవరి సొంతమయ్యాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: మాస్ రాజా రవితేజ అంటే ఎనర్జీకి మారుపేరు. తెరపై చాలా హుషారుగా సాగే పాత్రలే చేస్తుంటాడతను. విలన్ల మీదికి దూసుకెళ్లిపోవడమే తప్ప.. వాళ్లను బతిమాలుకోవడం.. రౌడీల చేతుల్లో దెబ్బలు తినడం.. కుటుంబ సభ్యులందరినీ చంపేస్తుంటే చేష్టలుడిగి చూస్తుండటం.. ఇలాంటి సన్నివేశాల్లో రవితేజను చూసి అభిమానులు తట్టుకోలేరు. ‘ఖిలాడి’లో తొలి గంట వరకు మాస్ రాజా పాత్ర ఇలాగే జీవం లేనట్లుగా ఉండి ఆశ్చర్యపరుస్తుంటుంది. రవితేజేంటి ఇంత డీలాగా కనిపించడం ఏంటి అనిపిస్తుంది. ఈ పాత్ర ప్రవర్తన చూస్తున్నంతసేపూ ఏదో తేడా కొడుతున్నట్లే అనిపిస్తుంది. అది కాస్తా సినిమా మీద ఇంప్రెషన్ ను కూడా తగ్గించేస్తుంది. ప్రేక్షకుల్లో నీరసం తెప్పించేస్తుంది. ఐతే గంట తర్వాత కానీ అసలు విషయం బోధపడదు ప్రేక్షకులకు. ఇంటర్వెల్ దగ్గరికొచ్చేసరికి సినిమాలో పాత్రల్నే కాదు.. ప్రేక్షకులను సైతం ‘ఫూల్స్’ను చేస్తూ అసలు రవితేజ బయటికి వస్తాడు. ఇప్పటిదాకా మీరు చూసిందంతా ట్రాష్ అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఇక్కడ మనకు ‘డార్లింగ్’ సినిమా కనిపిస్తుంది. కానీ ‘డార్లింగ్’లో అప్పటిదాకా చూపించిందంతా అబద్ధం అయినా సరే.. అదొక అందమైన కలలాగా అనిపించి ఎంజాయ్ చేస్తాం. కానీ ఇక్కడ చూసిందంతా నాన్సెన్స్ లాగా అనిపిస్తుంది తప్ప.. ఎంతమాత్రం మంచి ఫీలింగ్ కలగదు.

పోనీ అప్పటిదాకా అయ్యిందేదో అయ్యిందిలే అని తర్వాతైనా ‘ఖిలాడి’ కొత్తగా.. పకడ్బందీగా ఉండి ప్రేక్షకులకు కిక్కిస్తుందా అంటే అదీ లేదు. ప్రథమార్ధంలో ‘డార్లింగ్’ సినిమా చూపించి ప్రేక్షకులకు షాకిచ్చిన దర్శకుడు రమేష్ వర్మ.. సెకండాఫ్ లోకి వచ్చేసరికి హిందీ ‘రేస్’ను దించేశాడు. ఇంటర్వెల్ దగ్గర మొదలుపెడితే.. చివరి దాకా ‘ట్విస్టుల’ పేరుతో ప్రేక్షకులను ఫూల్స్ ను చేయడమే పనిగా పెట్టుకున్నాడు దర్శకుడు. ‘రేస్’లో మాదిరే డబ్బు కోసం ఒకరినొకరు మోసం చేసుకునే పాత్రలే కనిపిస్తాయి ద్వితీయార్ధమంతా. ఒకరిని మించిన దొంగలుగా పాత్రల్ని చూపిస్తూ.. ప్రతి పావు గంటకో ట్విస్టు ఇస్తూ.. ఇష్టారీతిన కథాకథనాలను నడిపించాడు దర్శకుడు. తెర మీద డబ్బులకు సంబంధించి ఎవరి గేమ్ వాళ్లు ఆడేస్తుంటారు. ఆ గేమ్ సీరియస్ గా.. ఇంటెన్స్ గా ఉంటే.. ప్రేక్షకులు థ్రిల్ కావడానికి అవకాశముంటుంది. కానీ ప్రతి సన్నివేశం సిల్లీతనానికి కేరాఫ్ అడ్రస్ లాగా ఉండటం.. హీరో ఏదనుకుంటే అది చేసుకుంటూ ముందుకెళ్లిపోతుండటం.. అతడికి బలమైన ఛాలెంజ్ అన్నదే లేకపోవడం.. ట్విస్టులు కాస్తా మరీ కామెడీగా తయారవడంతో ఎక్కడా ‘ఖిలాడి’ని సీరియస్ గా తీసుకునే అవకాశమే లేకపోయింది. ట్విస్టులు థ్రిల్ చేయాలి కానీ.. కామెడీగా అనిపించకూడదు. అదే ‘ఖిలాడి’తో ఉన్న అతి పెద్ద సమస్య.

పది వేల కోట్ల రూపాయల డబ్బుతో ముడిపడ్డ వ్యవహారమంటే ఆషామాషీనా? అంత డబ్బు చుట్టూ కథను నడిపించినపుడు సన్నివేశాలు గుండె జల్లుమనిపించేలా ఉండాలి. కానీ ఇంత పెద్ద మొత్తం చిన్న బ్యాగులో చేతులు మారినట్లుగా అటు ఇటు తిరిగేస్తుంటుంది ‘ఖిలాడి’లో. ఈ సినిమాను ఎంతమాత్రం సీరియస్ గా తీసుకోవద్దని సంకేతాలిచ్చేలాగే ఉంటుంది ప్రతి సన్నివేశం కూడా. హీరో పాత్ర అయితే మరీ విడ్డూరం. అతను అనుకున్నపుడు జైలుకు వెళ్లిపోతాడు. బయటికి రావాలనుకున్నపుడు వచ్చేస్తాడు. పక్కనో హ్యాకింగ్ నిపుణుడిని పెట్టుకుని.. ఫారిన్లో విలన్ డెన్లోకి మనిషిని పంపించేస్తాడు. నిమిషాల్లో పది వేల కోట్ల రూపాయల ఆచూకీ కనిపెట్టేస్తుంటాడు. ముక్కూ ముఖం తెలియని ఇంకో విలన్ని పట్టేస్తాడు. అతను ఆర్డరేయడం.. హ్యాకర్ ఇది కొంచెం కష్టమే అయినా ట్రై చేస్తా అని ఒక క్లిక్ కొట్టడం.. డేటా అంతా వచ్చి పడిపోవడం.. ఇదీ వరస. అంతంతమంది విలన్లు.. వాళ్లంతా చాలదన్నట్లు సీబీఐ అధికారిని అడ్డంగా పెట్టి.. అందులో ఒక్కరు కూడా హీరోకు ఎక్కడా ఒక్క ఛాలెంజ్ కూడా విసరకుండా చేష్టలుడిగా చూస్తుంటే.. ఎంతసేపూ హీరోనే గేమ్ ఆడుతుంటే.. ఇక సినిమాలో కిక్ ఏముంటుంది?

కథాకథనాల సంగతిలా ఉంచితే.. మాస్ ప్రేక్షకులు ఆశించే కొన్ని అంశాలకైతే ‘ఖిలాడి’లో లోటు లేదు. లాజిక్స్ గురించి ఆలోచించకుండా థ్రిల్లయిపోతాం అంటే సినిమాలో ట్విస్టులకైతే లెక్క లేదు. ఇంటర్వెల్ దగ్గర్నుంచి మాస్ రాజా అభిమానులు మెచ్చే ఎనర్జీతో కనిపించాడు. అతడి మేనరిజమ్స్.. ఫైట్లు.. ఛేజింగ్ సీన్లు.. అభిమానులతో పాటు మాస్ ను ఆకట్టుకోవచ్చు. ఇక హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటీ పడి అందాలు ఆరబోశారు. పాటలన్నీ ఆ కోణంలో మంచి కిక్కే ఇస్తాయి. వారికి తోడు అనసూయ సైతం తన వంతు గ్లామర్ విందు చేసింది. ఈ రకంగా రమేష్ వర్మ కమర్షియల్ మీటర్నయితే బాగానే ఫాలో అయ్యాడు. ఈ అదనపు హంగులు ఓ వర్గం ప్రేక్షకులను కొంత మేర ఆకట్టుకోవచ్చు కానీ.. కథాకథనాలను సీరియస్ గా తీసుకుంటే ‘ఖిలాడి’ని భరించలేం. హాల్లోకి ఎంటరయ్యే ముందే లాజిక్ తీసి పక్కన పెట్టి వెళ్లకుంటే.. ‘ఖిలాడి’తో ప్రయాణం చాలా కష్టమవుతుంది.

నటీనటులు: రవితేజ తన అభిమానులను మెప్పించేలా కనిపించాడు. ఇంటర్వెల్ వరకు తనకు నప్పని తరహాలో కనిపించి నిరాశ పరిచిన మాస్ రాజా.. తన శైలిలోకి మారాక మాత్రం మంచి ఎనర్జీతో దూసుకెళ్లాడు. ఓవరాల్ గా చూస్తే రవితేజ నుంచి ఆశించే స్థాయి వినోదం అయితే ఈ పాత్రలో లేదు. డింపుల్ హయతి గ్యాప్ లేకుండా అందాలు ఆరబోసింది. ఇలాంటి పెద్ద సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో రెచ్చిపోయిన కథానాయిక మరొకరు కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఐతే ఆమె లుక్స్ యావరేజ్ అనిపిస్తాయి. నటన పరంగా చెప్పడానికేమీ లేదు. మరో కథానాయిక మీనాక్షి చౌదరి కొంత మేర నటించడానికి ప్రయత్నించింది కానీ.. ఫలితం లేకపోయింది. మీనాక్షి కూడా ఒక పాటలో బాగానే గ్లామర్ విందు చేసింది. కానీ డింపుల్ ముందు మాత్రం ఆమె నిలవలేకపోయింది. అనసూయ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను బాగానే చేసింది. ఇప్పటిదాకా ఏ సినిమాలో లేనంత హాట్ గా కనిపించింది అనసూయ ఇందులో. అర్జున్ చేసిన సీబీఐ అధికారి పాత్ర జోకర్ లాగా తయారైంది. తన స్థాయికి తగినట్లు లేదు. రావు రమేష్.. ముకేష్ రుషి.. నికితిన్ ధీర్.. అనూప్.. సచిన్ ఖేద్కర్.. ఇలా విలన్ల జాబితా చాలా పెద్దదే. ఏవీ అంత ప్రభావం చూపించే పాత్రలు కావు. వాళ్లంతా తమ పరిధికి తగ్గట్లు నటించారు. మురళీ శర్మ.. వెన్నెల కిషోర్.. రావు రమేష్.. ఉన్ని ముకుందన్ ఓకే.

సాంకేతిక వర్గం: దేవిశ్రీ ప్రసాద్ కథాకథనాలను బట్టే సంగీతంలోనూ ఇంటెన్సిటీ చూపిస్తుంటాడు. ఈ నాన్ సీరియస్ ఫిలింకి ఈ మాత్రం చాలు అన్నట్లు పాటల విషయంలో ఏదో మొక్కుబడిగా లాగించేసినట్లు అనిపిస్తుంది. పాటలేవీ గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం కమర్షియల్ సినిమాల మీటర్లో సాగిపోయింది. సుజీత్.. జీకే విష్ణుల విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. భారీ లొకేషన్లలో.. పెద్ద తారాగణంతో బాగా ఖర్చు పెట్టి సినిమా తీసిన విషయం తెరపై కనిపిస్తుంది. శ్రీకాంత్ విస్సా మాటల్లో ఏమంత మెరుపుల్లేవు. ఇక కథ-స్క్రీన్ ప్లే రచయిత.. దర్శకుడు రమేష్ వర్మ విషయానికి వస్తే.. అతను చాలా సినిమాల నుంచి స్ఫూర్తి పొంది స్క్రిప్టు తీర్చిదిద్దుకున్నట్లు అనిపిస్తుంది. సీరియస్ థ్రిల్లర్ సినిమాలు తీసే నైపుణ్యం అతడిలో కనిపించలేదు. కథేమో థ్రిల్లర్ శైలిలో రాసుకుని.. దాన్ని కమర్షియల్ సినిమాల శైలిలో తీయడంతో కిచిడిలా తయారైంది. అతడి నాన్ సీరియస్ నరేషన్ సినిమాకు మైనస్ గా మారింది.

చివరగా: ఖిలాడి.. మసాలా కిచిడి

రేటింగ్-2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News