'సమ్మతమే' ట్రైలర్: చిన్నప్పటి నుంచీ పెళ్లే లక్ష్యంగా పెరిగిన కుర్రాడి కథ..!

Update: 2022-06-16 11:04 GMT
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ''సమ్మతమే''. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ''సమ్మతమే'' సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ మరియు టీజర్ కి విశేష స్పందన లభించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు.

చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కిరణ్ అబ్బావరం.. 'ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మి.. వాళ్ళు లేని ఇల్లు ఇలానే ఉంటుంది' అని తండ్రి చెప్పిన మాటలతో.. ఆ వయసులోనే పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా పెరిగిన.. తనకు సరిపోయే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాడు.

అలాంటి సమయంలో చాందిని చౌదరీని చూడడం.. తొలి చూపులోనే ఆమెను ఇష్టపడటం ప్రారంభించాడు కిరణ్. 'నీకు లైఫ్ లో గోల్ ఇంపార్టెంటా? లైఫ్ లోకి వచ్చే గర్ల్ ఇంపార్టెంటా?' అని హీరోయిన్ అడగ్గా.. 'నా లైఫ్ లో గోల్ యే లైఫ్ లోకి గర్ల్ రావడం' అని హీరో చెప్పడం అలరిస్తోంది.

అయితే ప్రేమలో పడిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు.. అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. హీరో తనకు కాబోయే భార్య తనకు నచ్చినట్లుగా ఉండాలని.. తన మాట వినాలని కొట్టుకుంటున్నాడని అర్థం అవుతోంది. స్వతంత్ర భావాలు కలిగిన హీరోయిన్ అతనితో ఇమడలేక 'నీకు నేనే కాదు.. ఏ అమ్మాయి కూడా కరెక్ట్ కాదు.. అద్దంలో నీ మొహం చూసుకొని బొట్టు పెట్టుకొని తాళి కట్టుకో' అని చెప్తోంది.

'లైఫ్ లో ఎవరినీ ఊరికే కలవలేం కృష్ణా.. అయితే అది బ్లెస్సింగ్ అయినా అయ్యుండాలి లేదా లెస్సన్ అయినా.. నిన్ను కలవడం బ్లెస్సింగ్ అనుకున్నా.. కానీ అది లెస్సన్' అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ ఇద్దరి మధ్య సమస్య ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి షరతులు లేని ప్రేమ గురించి హీరో ఎలా తెలుసుకున్నాడు? వీరిద్దరి ప్రేమ ఎక్కడిదాకా వెళ్ళింది? ఈ ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే 'సమ్మతమే' సినిమా చూడాల్సిందే.

ఇందులో కిరణ్ - చాందిని మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరూ సహజంగా నటించారు. రొమాంటిక్ సీన్స్ లోనూ అదరగొట్టారు. 'లారీలైనా గుద్దితే వెనక్కి చూస్తాయేమో కానీ.. ఈ అమ్మాయిలు మాత్రం తిరిగి చూసేలా లేరు' అంటూ ట్రైలర్ చివర్లో కిరణ్ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. మొత్తం మీద ఈ ఫన్ అండ్ రొమాంటిక్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోందని చెప్పాలి.

'సమ్మతమే' చిత్రానికి కథ స్క్రీన్ ప్లే గోపీనాథ్ రెడ్డి అందించారు. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చగా.. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ నిర్వహించారు. విప్లవ్ నిషాదం ఎడిటర్ గా.. సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

''సమ్మతమే'' చిత్రాన్ని 2022 జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇటీవల 'సెబాస్టియన్' సినిమాతో నిరాశ పరిచిన కిరణ్ అబ్బవరం.. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


Full View
Tags:    

Similar News