మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కోడి ప్రస్తావన పలు మార్లు వినిపిస్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో రిక్షావోడు సినిమాలో కొక్కొక్కొకో అంటూ ఆరంభమయ్యే పాట 'నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకోనీ' అని సాగుతుంది. మెగాస్టార్ కోడి ఇష్టాలు ఇక్కడితో ఆగిపోవు. 'కోడి కూర చిల్లు గారె.. కూరే వడ్డించుకోవె ఒక్కసారి' అంటూ అందరివాడులో ఓ ఊర మాస్ సాంగ్ ఉంటుంది. జై చిరంజీవ చిత్రంలో కూడా 'కొ క్కొ కోడి బాగుంది.. కు కు కూత బాగుంది' అంటూ కూడా ఓ పాట పాడుకుంటారు చిరు.
ఇప్పుడు ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఈ కోడి సెంటిమెంట్ ను బాగానే పట్టుకొస్తున్నాడు. కాకపోతే ఈ అల్లుడు లేటెస్ట్ జనరేషన్ కదా.. అందుకే కూర గురించి పాడుకునేందుకు బదులు.. కోడికి సంతాపం పాడేస్తున్నట్లు తెగ యాక్ట్ చేసేస్తున్నాడు. ఇతడు హీరోగా తెరకెక్కిన విజేత సినిమాలోంచి 'కొ కొక్కోరోకో' అంటూ సాగే పాటను జూన్ 22న ఉదయం 8గం.9 ని. లకు విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. చికెన్ సాంగ్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారండోయ్.
పాట సంగతేమో కానీ.. కోడి చనిపోయిందుకు సంతాపం అంటూ పోస్టర్ లో రాసిన విధానం.. దానికి కళ్యాణ్ దేవ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నిజంగానే తెగ నవ్వు తెప్పించేస్తున్నాయి. మరి మామగారి ఎంతో ఇష్టమైన కోడికి.. అల్లుడు కళ్యాణ్ దేవ్ సంతాపం పాడేయడాన్ని ఆడియన్స్ థియేటర్లలో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.