గుర్తింపు లేని హీరోల గురించి ధనుష్ మూవీ..!
కోలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో అమరన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్నిసొంతం చేసుకుంది.
కోలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో అమరన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్నిసొంతం చేసుకుంది. 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలో నిలిచిన అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. అమరన్ సినిమాలో గ్యాలంట్రీ అవార్డును సొంతం చేసుకున్న ముకుంద్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను చేసిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియాసామి తన తదుపరి సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేయబోతున్నారు. ఇటీవల సినిమా పూజా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి.
ధనుష్55 వర్కింగ్ టైటిల్‌తో సినిమా పనులు జరుగుతున్నాయి. తాజాగా ఒక మీడియా సంస్థతో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి మాట్లాడుతూ ధనుష్‌తో చేయబోతున్న సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన గత చిత్రంలో రియల్ హీరో, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ జీవిత కథ ఆధారంగా సినిమాను చేశాను. తన తదుపరి సినిమాను సైతం రియల్ హీరోల కథ ఆధారంగా చేయబోతున్నాను. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ధనుష్ వంటి హీరోలతో మాత్రమే అలాంటి హీరోల కథలను చెప్పగలం అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుందని ఆయన తెలియజేశాడు.
సమాజంలో మనకు తెలియని రియల్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారి జీవితాల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సినిమాలో చాలా మందికి తెలియని గొప్ప రియల్ హీరోల కథలను చెప్పబోతున్నాం. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా, ఆలోచింపజేసే విధంగా సినిమా ఉంటుందని ఆయన అన్నారు. తమిళ్‌తో పాటు అన్ని భాషల్లోనూ ప్రస్తుతం తాను ధనుష్‌తో రూపొందించబోతున్న సినిమాను విడుదల చేయబోతున్నాం. గుర్తింపు లేని హీరోల జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు పేర్కొన్నాడు.
ధనుష్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేరా' సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదల తేదీని కన్ఫర్మ్ చేశాడు. మరో వైపు తన దర్శకత్వంలోనూ ధనుష్ ఒక సినిమాను చేస్తున్నారు. రాయన్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ వరుసగా వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి పెరియాస్వామి దర్శకత్వంలో సినిమా సైతం ఉండబోతుంది. ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు అయిన ధనుష్ మరోసారి ఈ సినిమాను ప్రయోగాత్మకంగా చేసి ప్రేక్షకులను అలరిస్తాడేమో చూడాలి.