దిల్ రాజు సినిమాకి ఛాన్స్ ఇస్తే గవర్నమెంట్ ఇబ్బంది పడుతుందా?
'గేమ్ ఛేంజర్' సినిమాని సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ''గేమ్ ఛేంజర్''. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తమ బ్యానర్ లో మైల్ స్టోన్ 50వ ప్రాజెక్ట్ కావడంతో డబ్బుకు ఏమాత్రం వెనకాడలేదు. పాటలకే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. శంకర్ గత చిత్రాలకు తీసిపోకుండా, విజువల్ గ్రాండియర్ గా తీయడానికి కావాల్సినవన్నీ సమకూర్చారు. ఈ సినిమా మీద మేకర్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.
'గేమ్ ఛేంజర్' సినిమాని సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. దీని కోసం చిరంజీవి 'విశ్వంభర' మూవీని కూడా వాయిదా వేసుకున్నారు. విడుదలకు గట్టిగా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడం లేదు. RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చే సినిమాకి ఉండాల్సినంత క్రేజ్ అయితే లేదని చెప్పాలి. ఇప్పటి వరకూ వదలిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ తీసుకురాలేకపోయింది. పాటలకు మిలియన్ల వ్యూస్, లైక్స్ వస్తున్నాయి కానీ.. పెద్దగా వైరల్ అవ్వడం లేదు. అమెరికా వెళ్లి ఈవెంట్ చేసినా జనాలు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి.
ఇక 'గేమ్ ఛేంజర్' మూవీకి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి లభిస్తుందని ఇన్నాళ్లూ నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ పెద్ద సినిమాలకు టికెట్ హైక్స్, స్పెషల్ షోలకు పర్మిషన్స్ లభించాయి. కాబట్టి ఈ మెగా మూవీకి ఏపీలో సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణాలో మాత్రం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సర్కారు నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్వాగతించింది.
ఒక్కో సినిమాకు ఒక్కో రేటు పెట్టటం వలన ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని, నిర్మాణ ఖర్చు ఎక్కువ అయిందని రేట్లు పెంచుతున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు కానీ, థియేటర్‌లో ఆక్యుపెన్సీ తగ్గుతోందని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అభిప్రాయ పడింది. రాబోయే రోజుల్లో టికెట్ రేట్స్ పెంచబోమంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. బిగ్ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడంతో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు దెబ్బ తింటున్నాయని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఎగ్జిబిటర్లు కూడా రేవంత్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సాధారణ ప్రజలకు సినీ వినోదం అందుబాటులో లేకుండా చేస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో, రేవంత్ సర్కార్ నిర్ణయానికి సామాన్యుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇదంతా 'గేమ్ ఛేంజర్' ఓపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి టైంలోనే సీఎంను నిర్మాత దిల్ రాజు కలిశారు. ఈరోజు లేదా రేపు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తారని, మళ్ళీ ఇండస్ట్రీ పెద్దలతో కలిసి వెళ్లి మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకుంటామని మీడియాకి తెలిపారు. ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిగా ఉంటానని చెప్పారు.
ఒకవేళ సీఎంతో భేటీ తర్వాత 'గేమ్ ఛేంజర్' సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోడానికి పర్మిషన్ ఇస్తే, రాబోయే అన్ని చిత్రాలకి కూడా పెంచాల్సి ఉంటుంది. అలా చేస్తే గవర్నమెంట్ మాట తప్పినట్లు అవుతుంది. అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ ఉండవని ప్రకటించి కూడా అనుమతులు మంజూరు చేస్తే.. ప్రభుత్వం మాట తప్పినట్టుగా ప్రజలు భావిస్తారు. సామాన్యులకు సినీ వినోదం అందుబాటులో లేకుండా చేస్తున్నారంటూ మళ్ళీ ప్రేక్షకులు విమర్శలు చేస్తారు. అందుకే ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం తర్వాత ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే 'గేమ్ ఛేంజర్' సినిమాపై రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేయదని చెబుతున్నారు. ఇందులో చెర్రీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. అంజలి, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.