తమిళ తంబీలు సంక్రాంతి పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వారు నిర్వహించే జల్లి కట్టు ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గత ఏడాది జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించడంతో మెరీనా బీచ్ లో తమిళ తంబీలందరూ భారీ సంఖ్యలో చేరి నిరసనలు తెలిపారు. జల్లికట్టుకు చాలామంది సినీ తారలు - రాజకీయ నేతలు కూడా బహిరంగంగా మద్దతు తెలిపారు. ఆ తర్వాత కేంద్రం చట్ట సవరణ చేసి తమిళుల సెంటిమెంట్ ను గౌరవించడంతో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ, పెటా మాత్రం జల్లికట్టుపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెబుతోంది. వచ్చే సంక్రాంతికి మరో నెల సమయమున్న నేపథ్యంలో తమిళనాడులో మళ్లీ జల్లికట్లు సందడి మొదలైంది.
ఈ ఏడాది జల్లికట్టును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తమిళతంబీలు ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాదిలాగా ఇబ్బందులు ఏమీ లేకపోవడంతో ఈ సారి తమిళ సినీ ప్రముఖులు జల్లికట్టుకు జై కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది జనవరి 7 నుంచే ఉత్సవాలు మొదలెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వాటిలో పాల్గొనాల్సిందిగా కోలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయట. జల్లికట్టు 'సెంటిమెంట్` ను గౌరవిస్తూ పలువురు ప్రముఖ హీరో - హీరోయిన్లు ఆ పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారట. రజనీకాంత్ - కమల్ హాసన్ - విశాల్ - లారెన్స్ లతో పాటు పలువురు హీరోయిన్లు కూడా ఈ ఉత్సవాల్లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. మరి, ఈ సారి జల్లికట్టుపై పెటా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. అందులోనూ, ఈ సారి చాలా మంది కోలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకునేందుకు రెడీ అయిన నేపథ్యంలో జల్లికట్టు ఉత్సవాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.