త్రివిక్రమ్‌ ను బుద్ది ఉందా నీకు అన్నాడట..!

Update: 2022-11-08 11:30 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాల కాలం పూర్తి అయ్యింది. మొదటి సినిమా ఛాన్స్ రావడానికి త్రివిక్రమ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎమ్మెస్సీ గోల్డ్‌ మెడల్‌ సంపాదించినా కూడా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నించి ఎన్నో చిత్కారాలు ఎదుర్కొని చివరకు ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడు.

త్రివిక్రమ్‌ పలు ఇంటర్వ్యూల్లో తన ఎదుగుదలకు కారణం అయిన వారి గురించి పదే పదే చెబుతూ ఉంటాడు. అందులో ఒక వ్యక్తి రచయిత కొమ్మనాపల్లి గణపతి రావు. హెచ్‌ ఎం టీ లో ఉద్యోగం చేస్తూ సినిమాలకు పార్ట్‌ టైమ్‌ రచయితగా వ్యవహరిస్తూ ఉండే కొమ్మనాపల్లి గణపతి రావు వద్ద అసిస్టెంట్‌ గా ఛాన్స్ కోసం త్రివిక్రమ్‌ మొదట ఆయన్ను కలిశాడట.

తాజాగా కొమ్మనాపల్లి గణపతి రావు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ఇండస్ట్రీ లో అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు త్రివిక్రమ్‌ మొదటి సారి నా వద్దకు వచ్చాడు. ఆ సమయంలో నన్ను అసిస్టెంట్‌ గా పెట్టుకోమని విజ్ఞప్తి చేయగా.. తాను ఇండస్ట్రీలో పార్ట్‌ టైమ్‌ రచయితను.. తాను ఎలా అసిస్టెంట్‌ గా పెట్టుకుంటాను అన్నాను.

అప్పుడే ఏం చదివావు అని నేను ప్రశ్నించగా.. ఎమ్మెస్సీ ఫిజిక్స్ గోల్డ్‌ మెడలిస్ట్‌ అన్నాడు. అప్పుడు నేను బుద్ది ఉందా నీకు.. ఇండస్ట్రీలో అస్సలు బాగా లేదు. అవకాశాలు వస్తాయో లేదో తెలియదు. కనుక నువ్వు చదువుకు తగ్గట్లుగా మంచి ఉద్యోగం ఎంపిక చేసుకుని చేయి అంటూ సూచించాను.

తాను సినిమా ఇండస్ట్రీ లో సెటిల్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.. ఇండస్ట్రీ లో తాను ఉండాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడే ఏమైనా కథలు రాశావా అంటూ ప్రశ్నించగా లేదన్నాడు. ఇండస్ట్రీలో ఉండాలి అంటే కథలు పట్టుకుని తిరగాలి అన్నాను. ఆ తర్వాత రోజు 'ది రూడ్‌' అనే కథను రాసి తీసుకు వచ్చాడు.

నేను ఆ కథను ఆంధ్ర జ్యోతి ఎడిటర్‌ కి ఫోన్ చేసి అచ్చు వేయించాను. అది చూసుకుని చాలా మురిసి పోయేవాడు. అప్పుడే మెరుపు అనే సినిమా కు అప్రెంటిస్ గా పెట్టించాను. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నా నన్ను ఎప్పటికి కూడా త్రివిక్రమ్‌ మరచి పోకుండా ప్రతి ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటూ రచయిత కొమ్మనాపల్లి గణపతి రావు అన్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News