'కొమురం భీముడో' ప్రోమో: RRR లోని ఉద్వేగభరితమైన గీతం..!

Update: 2021-12-23 06:49 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. వరుస అప్డేట్స్ తో సినీ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు.

''ఆర్.ఆర్.ఆర్'' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'దోస్తీ' 'నాటు నాటు' 'జనని' పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో సినిమాలోని 'కొమురం భీముడో' అనే నాల్గవ పాటను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయింది. తాజాగా 'భీమ్ తిరుగుబాటు' పేరుతో సాంగ్ ప్రోమోని ఐదు భాషల్లో వదిలారు.

'కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసులెవడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో' అంటూ సాగిన ఈ పాట ఉద్వేగభరితంగా ఉంది. ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర స్వభావాన్ని ఆశలను ఈ పాటలో తెలియజేయనున్నారు. ఈ పాటలో తారక్ ఫేస్ లో బాధ కోపం ఆవేశం వంటి అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి.

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి 'కొమురం భీముడో' పాటకు వినసొపైన బాణీలు సమకూర్చారు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ పాటను ఐదు భాషల్లోనూ ఆలపించడం విశేషం. తెలుగు వెర్షన్ కు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. పూర్తి పాట మ్యూజికల్ వీడియోని రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

'కొమురం భీముడో' సాంగ్ మ్యూజికల్ వీడియోలో ఎన్టీఆర్ తో పాటుగా కాలభైరవ కూడా కనిపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటలోని విజువలైజేషన్ & కాన్సెప్ట్ ను డిజైన్ చేశారు. రిషి పంజాబీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు మధ్య స్నేహాన్ని చూపించనున్నారు. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రీయా కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.


Full View
Tags:    

Similar News