'మంచు' కోసం రంగంలోకి 'కోన'

Update: 2022-03-09 01:30 GMT
మంచు ఫ్యామిలీ ఇప్పుడు సినిమాల పరంగా పెద్ద సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. ఆ ఫ్యామిలీ హీరోల సినిమాలు ఓ మోస్తరుగా ఆడి కూడా చాలా ఏళ్లయింది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్.. ముగ్గురూ చివరగా చేసిన సినిమాలన్నీ పెద్ద డిజాస్టర్లే అయ్యాయి. తాజాగా 'సన్ ఆఫ్ ఇండియా'కు ఎదురైన పరాభవం గురించి అందరికీ తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో ఎలాంటి సినిమా చేయాలో తెలియని అయోమయం మంచు హీరోలను వెంటాడుతోంది. అందుకేనేమో ముందు అనుకున్న 'ఢీ' సీక్వెల్‌ను పక్కన పెట్టి 'గాలి నాగేశ్వరరావు' పేరుతో ఒక వెరైటీ సినిమా ఏదో చేస్తున్నాడు విష్ణు. ఇషాన్ సూర్య అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడని.. ఇందులో విష్ణు సరసన పాయల్ రాజ్‌పుత్ కథానాయిక అని ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది. ఇప్పుడీ సినిమా గురించి రెండు అప్‌డేట్స్ తెలిశాయి.

అందులో ఒకటి.. ఈ చిత్రంలో ఒకప్పటి శృంగార తార  సన్నీ లియోన్ ఓ కీలక పాత్ర చేస్తుండటం. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా స్వయంగా సన్నీనే వెల్లడించింది. ఇంతకుముందు మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో చిన్న క్యామియో చేసిన సన్నీ.. ఇప్పుడు మంచు విష్ణు సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషమే.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో కొత్త అప్‌డేట్ ఏంటంటే.. దీనికి స్క్రిప్టు అందిస్తున్నది సీనియర్ రచయిత కోన వెంకట్ అట. ఒకప్పుడు 'ఢీ'తో విష్ణు కెరీర్‌కు మంచి ఊపు ఇచ్చిన ఘనత కోనదే. ఆయనకు కూడా ఆ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత భారీ విజయాలందుకున్న కోన.. ఒక దశ దాటాక వెనుకబడిపోయాడు.

ఆయన కూడా రచయితగా మెరిసి చాలా కాలం అయింది. ఇప్పుడాయన ఫేడవుట్ దశలో ఉన్నాడు. ఇలాంటి రచయిత.. ఏమాత్రం ఫాంలో లేని మంచు విష్ణు సినిమాకు కథ అందించడం చిత్రమే. వీళ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ కలిపిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మోహన్ బాబు సినిమాలోనూ వైసీపీ సానుభూతిపరులైన పోసాని, ఆలీ తదితరులు నటించడం తెలిసిందే.
Tags:    

Similar News