స్టార్ హీరో నాలుగేళ్ల క‌ష్టం గంగ‌పాలు!

Update: 2022-08-13 16:11 GMT
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా అంటే దేశ వ్యాప్తంగా ఓ క్రేజ్ వుంటుంది. కొత్త క‌థ, ప్ర‌తీ ఒక్క‌రికీ న‌చ్చే క‌థ అయితేనే త‌ను చేస్తాడ‌నే టాక్ వుంది. అందుకే అమీర్ నుంచి సినిమా అంటే ప్ర‌తీ ఒక్క‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఏళ్ల‌యినా స‌రే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ వుంటారు. సినిమా అంగీక‌రించిన ద‌గ్గ‌రి నుంచి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే వ‌ర‌కు అమీర్ ఖాన్ ప్ర‌తీ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వుంటారు.

ఇక సినిమా పూర్త‌య్యాక దాన్ని ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కు చేర్చ‌డంలోనూ ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంటారు. దేశం మొత్తం ప‌ర్యిటించి సినిమాని ఏ ల‌క్ష్యం కోసం చేశామో ఆ ల‌క్ష్యం నెర‌వేరే వ‌ర‌కు క్ష‌ణం కూడా విశ్ర‌మించ‌కుండా ప‌ని చేస్తుంటారు.

ఇదే అమీర్ ని ప్ర‌తీ ఒక్కరికి చేరువ‌య్యేలా చేసింది. అత‌ని సినిమా కోసం వేచి చూసేలా చేస్తూ వ‌స్తోంది. న‌చ్చిన క‌థ‌ని జ‌నాల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి దాదాపు మూడేళ్ల పాటు శ్ర‌మించి అది అనుకున్న విధంగా రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.

అందుకే అమీర్ ని అంతా మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్ అంటుంటారు. ఆయ‌న దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత న‌టించిన మూవీ `లాల్ సింగ్ చ‌డ్డా`. హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా తెర‌కెక్కించారు. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఆగ‌స్టు 11న విడుద‌లై అమీర్ కెరీర్ లోనూ భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. అమీర్ ప‌డిన శ్ర‌మ‌ని, నాలుగేళ్ల క‌ష్టాన్ని గంగ‌పాలు చేసింది. ఈ మూవీ కోసం అమీర్ చాలా శ్రమించారు. కానీ ఆయ‌న శ్ర‌మంతా వృధా అయిపోయింది.

క‌రోనా కార‌ణంగా అనుకున్న బ‌డ్జెట్ కాస్తా రూ.200 కోట్ల‌కు పెరిగిపోయింది. ఈ మూవీకి అమీర్ తో పాటు కిర‌ణ్ రావు కూడా ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ మూవీతో అమీర్‌, కిర‌ణ్ రావు భారీ స్థాయిలో న‌ష్టాల‌ని చ‌విచూడ‌టం ఖాయంగా క‌నిపిస్తోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓటీటీ డీల్ నుంచి అయినా బ‌య‌ట‌ప‌డాల‌నుకున్నా ఆరు నెల‌ల త‌రువాతే ఓటీటీకి ఇవ్వాల‌నుకోవ‌డంతో అది కూడా కుదిరే పనిలా క‌నిపించ‌డం లేదు.

పోనీ ఈ వారం అయినా ప్రేక్ష‌కుల థియేట‌ర్ల‌కు వ‌స్తారేమో అనుకుంటే ప్ర‌తీ థియేట‌ర్ ముందు నిల‌బ‌డి లౌడ్ స్పీక‌ర్ల‌తో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు రావ‌ద్దంటూ కొంత మంది ప్ర‌చారం మొద‌లు పెట్టారు. బాయ్ కాట్ `లాల్ సింగ్ చ‌డ్డా`.. మ‌న డ‌బ్బులు తీసుకుని మ‌న‌పై విషం చిమ్ముతున్నారంటూ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో థియేట‌ర్ల‌కు జ‌నం వ‌చ్చే ప‌రిస్థితి లేదు. చాలా వ‌ర‌కు షోల‌ని ర‌ద్దు చేశారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇండియ‌న్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హీరోకు ఇలాంటి ప‌రిస్థితి రావ‌డం నిజంగా విచార‌క‌రం అంటూ బాలీవుడ్ నిట్టూరుస్తోంది.
Tags:    

Similar News