'లచ్చుమమ్మో' వీడియో: మిరియాల - గోరేటి కలయికలో వచ్చిన ఫోక్ మెలొడీ..!

Update: 2022-10-31 16:33 GMT
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' 'ఎక్స్ ప్రెస్ రాజా' 'కృష్ణార్జున యుద్ధం' 'మ్యాస్ట్రో' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు మేర్లపాక గాంధీ. అలానే రచయితగా 'ఏక్ మినీ కథ' చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఏక్ మినీ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'' అంటూ వస్తున్నారు గాంధీ.

సంతోష్ శోభన్ మరియు ఫారియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్‌ 'LSS' ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌ లో భాగంగా, తాజాగా 'లచ్చుమమ్మో' అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

'ఓ లచ్చుమమ్మా... ఆ.. కంచెరేగి తీపివోలే లచ్చమమ్మో.. నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మా..' అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. రామ్ మిరియాలా ఈ సాంగ్ కంపోజ్ చేయడమే కాకుండా తనదైన శైలిలో ఆలపించాడు. ఈ ఫోక్ మెలొడీకి గోరేటి వెంకన్న అర్థవంతమైన సాహిత్యం అందించారు.

జానపద రాగాన్ని వైవిధ్యంగా బీచ్ ఒడ్డున హీరో హీరోయిన్లపై చిత్రీకరించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇందులో సంతోష్ శోభన్ మరియు ఫరియా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ట్యూన్ మరియు గాత్రం అద్భుతంగా కుదరగా.. గోరేటి వెంకన్న తన సాహిత్యంతో దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు.

'లచ్చమమ్మో' గీతం విజువల్ గానూ ఆకట్టుకుంటోంది. ఇందులో సంతోష్ - ఫరియా వేసిన సింపుల్ స్టెప్పులు ఆకర్షణీయంగా ఉన్నాయి. భాను మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసారు. వసంత్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. రాము తూము ఎడిటింగ్ వర్క్ చేసారు.

'జాతి రత్నాలు' సినిమా కోసం 'చిట్టీ' వంటి చార్ట్ బస్టర్ ని అందించిన రామ్ మిరియాల.. ఇప్పుడు ''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'' చిత్రం కోసం స్వరపరిచిన 'లచ్చమమ్మో' పాట ఇన్స్టెంట్ హిట్ గా నిలిచింది. ఆ పాట మాదిరిగానే ఈ ఫోక్ మెలోడీ వైరల్ అయ్యే అవకాశం ఉంది. యాదృచ్ఛికంగా అందులో చిట్టీగా నటించిన ఫరియా అబ్దుల్లా.. ఈ సాంగ్ లో లచమమ్మగా మారిపోయింది.

LSS చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ఆముక్త క్రియేషన్స్ తో వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఇందులో సుదర్శన్ - బ్రహ్మాజీ - నరేన్ - మైమ్ గోపి - సప్తగిరి - మిర్చీ కిరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు మరియు ఇటీవల వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'' చిత్రాన్ని నవంబర్ 4న థియేట్రికల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసారు. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'లచ్చమమ్మో' పాట ఈ సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News