తెలుగ‌మ్మాయిలు ఏమైపోయారు.. లేడీ బాస్ ఆవేద‌న‌!

Update: 2019-10-29 06:08 GMT
దీపావ‌ళి కానుక‌గా స‌రిలేరు నీకెవ్వ‌రు టీమ్ భార‌తి మ్యాడ‌మ్ లుక్ ని లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ హుందా అయిన పాత్ర‌లో విజ‌య‌శాంతి న‌టిస్తున్నార‌ని ఈ పోస్ట‌ర్ రివీల్ చేసింది. ప్ర‌స్తుతం ఫ్యాన్స్ లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 80ల‌లో లేడీ సూప‌ర్ స్టార్ ఎవ‌రు? అంటే క‌చ్ఛితంగా విజ‌య‌శాంతి పేరు అందులో ప్ర‌థ‌మంగా ఉంటుంది. అంత పెద్ద స్టార్ డ‌మ్ ని వ‌దులుకుని రాజ‌కీయాలు ఉద్య‌మాలు అంటూ ప‌ది సంవ‌త్స‌రాలుగా కొత్త దారిలోనే ఉన్నారు.

దాదాపు 25 ఏళ్ల త‌ర్వాత తిరిగి ముఖానికి రంగేసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. దీపావ‌ళికి రిలీజ్ చేసిన లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చినందుకు అభిమానుల‌కు తాజాగా విజ‌య‌శాంతి ఓ ఇంట‌ర్వ్యూలో కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో తెలుగులో తెలుగ‌మ్మాయిలు ప‌లుచ‌న అవ్వ‌డంపై విజ‌య‌శాంతి ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

పొరుగు నాయిక‌లు మ‌న భాష‌లోకి రావ‌డంపై మీ అభిప్రాయ‌మేమిటి?  తెలుగుమ్మాయిలు స‌రిగా రావ‌డం లేద‌ని మీరు అనుకుంటున్నారా.. లోపం ఎక్క‌డ ఉంది? అని ప్ర‌శ్నిస్తే.. నేను కూడా ఇరుగు పొరుగు భాష‌ల్లో చేశాను. పొరుగు నుంచి ఇక్క‌డికి రావ‌డం త‌ప్పుకాదు. అయితే తెలుగ‌మ్మాయిలు ఏమ‌య్యారు.. ఎందుకు రావ‌డం లేదు అన్న‌దే నా బాధ‌. మ‌నదైన‌ భాష‌లో అవ‌కాశాలు ఉన్నా వాళ్లు ఎందుకు రావ‌డం లేదు అన్న‌ది అర్థం కావ‌డం లేదు. ఏమైపోయారు? ఎవ‌రూ లేరా? అనిపిస్తోంది.. అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు ష్యూర్ షాట్ గా విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమాని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News