‘కబాలి’ రిలీజ్ రోజు షాక్ తప్పదా?

Update: 2016-07-16 12:23 GMT
ఇంతకుముందు ఓ సినిమాకు బయ్యర్లు నష్టపోతే.. అంతే సంగతులు. ఆ తర్వాత నిర్మాతకు వాళ్లకు సంబంధం ఉండేది కాదు. కానీ ఈ మధ్య ఓ సినిమాకు నష్టం వాటిల్లితే.. నిర్మాత వాటిని వెంటనే.. లేదా తర్వాతి సినిమా టైంలో రికవర్ చేయక తప్పట్లేదు. ఈ సంప్రదాయం తమిళం నుంచి తెలుగుకూ విస్తరించింది. బయ్యర్లు ఒక్కతాటిపై నిలుస్తూ నిర్మాతలు నష్టాల్ని రికవర్ చేయక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. బెట్టు చేస్తే.. సైలెంటుగా ఉంటూ రిలీజ్ రోజు అడ్డం పడుతున్నారు. కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలకు సైతం ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. గత ఏడాది ‘గంగ’ను ఇలాగే అడ్డుకున్నారు.

ఇప్పుడు ‘కబాలి’కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందేమో అని ఆందోళన నెలకొంటోంది. ఇంతకుముందు రజినీ సినిమా ‘విక్రమసింహా’ విషయంలో లక్ష్మీగణపతి ఫిలిమ్స్ రూ.7 కోట్ల దాకా నష్టపోయిందంటున్నారు. ఆ సినిమాకు బ్యాకప్ గా నిలిచిన రజినీ ఫ్యామిలీ నష్టాన్ని భర్తీ చేయలేదు. దీంతో ‘కబాలి’ విడుదలను ఆపడానికి ‘లక్ష్మీగణపతి ఫిలిమ్స్’ రెడీ అవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ‘కబాలి’ తెలుగు వెర్షన్ విషయంలో ప్రమోషన్ల సందడి కనిపించకపోవడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు. లక్ష్మీగణపతి ఫిలిమ్స్ సంస్థ ప్రతినిధులు సైలెంటుగా బయ్యర్లను కూడగడుతున్నట్లు సమాచారం. ఐతే ‘కబాలి’ విషయంలో ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్నారు. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు ఈ నెల 22న విడుదలవుతుంటే.. దాన్ని ఆపేస్తే జనాల ఫ్రస్టేషన్ మామూలుగా ఉండదు. మరి వచ్చే శుక్రవారం ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News