లార్గో వించ్ మ‌ళ్లీ ఏసేశాడే!

Update: 2019-08-31 15:30 GMT
భారీ కాన్వాసుపై సినిమా తీసేప్పుడు ఇక‌పై మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యితలు గుర్తుంచుకోవాల్సిన ప్రాథ‌మిక సూత్ర‌మేంటో ఇప్ప‌టికే ఓ క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే. ఇన్నాళ్లు తెలుగు సినిమాల్లో కాపీ కంటెంట్ వివాదాలు కేవ‌లం స్థానికంగానే వినిపించేవి. కానీ ఇప్పుడు అది కాస్తా ఖండాంత‌రాల‌కు స‌రిహ‌ద్దులు దాటి వెళ్లిపోతోంది. ఎక్క‌డో విదేశాల్లో ఉన్న సినీప్ర‌ముఖులు సైతం మ‌న సినిమాల‌పై కామెంట్లు చేసేస్తున్నారు. కాపీ కొట్టేశారంటూ వివాదాన్ని రాజేస్తున్నారు. దీనివ‌ల్ల మ‌న ప‌రువు మ‌ర్యాద‌లే మంట‌గ‌లుస్తున్నాయి. క్రియేట‌ర్ల‌కు ఇది మ‌రీ అంత మంచిది కాద‌నే సంకేతం అందుతోంది.

తాజాగా రిలీజైన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`పైనా ఈ త‌ర‌హా వివాదం మొద‌లైంది. ఈ సినిమా కంటెంట్ చూసేందుకు కాస్తంత అటూ ఇటూగా ప‌వ‌న్ క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి`ని పోలి ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా అజ్ఞాత‌వాసి స్ఫూర్తి అయిన లార్గో వించ్ గురించి ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. అయితే ఆ మాట సామాజిక మాధ్య‌మాల‌ ద్వారా లార్గో వించ్ ద‌ర్శ‌కుడు జెరోమ్ కి చేరిపోవ‌డంతో మ‌రోసారి అత‌గాడు చెల‌రేగిపోయాడు. ``నాకు ఇండియాలో ప్రామిస్సింగ్ కెరీర్ ఉన్న‌ట్టుంది!`` అంటూ పంచ్ వేసేశాడు. మ‌న మేక‌ర్స్ పై అదోర‌కంగా ఏసేశాడ‌నే చెప్పొచ్చు.

అజ్ఞాత‌వాసి ప్ర‌ధాన ఇతివృత్తం ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు జెరోమ్ స‌ల్లే తెర‌కెక్కించిన‌ లార్గో వించ్ చిత్రం నుంచి లిఫ్ట్ చేసిన‌ది అంటూ అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత దాని గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ  సాగింది. బెల్జియం న‌వ‌ల లార్గో వించ్ ఆధారంగా అదే టైటిల్ తో రూపొందించిన చిత్ర‌మది. తాజాగా సుజీత్ ఎంచుకున్న థీమ్ కూడా ఇంచుమించు అలానే ఉంద‌ని తెలుగు మీడియాలో విశ్లేష‌ణ‌లు వెలువ‌డ‌డం అది కాస్తా అంత‌ర్జాతీయంగానూ పాపుల‌రైపోవ‌డం చూస్తుంటే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అందుకే క‌నీసం భారీ బ‌డ్జెట్ల‌తో పెద్ద స్థాయిలో సాహ‌సం చేసేప్పుడు అయినా ఒరిజిన‌ల్ కంటెంట్ కోసం పూర్తి స్థాయిలో మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎఫ‌ర్ట్ పెడితే బావుంటుందేమో. అయితే కేవ‌లం రెండు చిత్రాల కిడ్ సుజీత్ పై ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించేయ‌డం చూస్తుంటే .. మునుముందు ఏ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌కు అయినా ఇలాంటి ముప్పు త‌ప్ప‌ద‌నే అర్థం. సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో మంచి కంటే కీడు ఎక్కువ‌గా జ‌రుగుతోంది కాబ‌ట్టి ఆ మేర‌కు మ‌న మేక‌ర్స్ కూడా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. లేదంటే అంతిమంగా బుక్క‌య్యేది ఆ సినిమాని నిర్మించిన నిర్మాత‌లే.
Tags:    

Similar News