లతా మంగేష్కర్ ఆరోగ్యం మళ్లీ విషమం

Update: 2022-02-05 11:30 GMT
ప్రముఖ గాయని ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆమె దాదాపు మూడు వారాల పాటు కరోనాతో పోరాటం చేశారు. కొన్ని రోజుల క్రితమే ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. కాని ఇంతలోనే మళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణించిందని వార్తలు రావడం అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో ఉంచి లతా మంగేష్కర్ గారికి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె ఆరోగ్యం విషయమై ఆసుపత్రి వర్గాల వారు అధికారికంగా మరి కాసేపట్లో హెల్త్‌ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.

జనవరి 11న కోవిడ్ తో లతా మంగేష్కర్‌ గారు ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. ఆ సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ స్వయంగా వైధ్యులు వెల్లడించారు. ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలు పుకార్లు షికార్లు చేశాయి. కాని ఆమె అభిమానులు చేసిన ప్రార్థన ఫలితంగా ఆమె కరోనా నుండి బయట పడ్డట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు కూడా మీడియాకు తెలియజేశారు. ఆమె మళ్లీ మునుపటి ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఎదురు చూస్తున్న సమయంలో మళ్లీ బ్యాడ్‌ న్యూస్‌ వినాల్సి వచ్చింది.

92 ఏళ్ల లతా మంగేష్కర్ కరోనాతో పలు అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. అప్పటికే ఉన్న ఆమె సమస్యలు పెద్దవి అవ్వడం తో ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి నట్లు తెలుస్తోంది. ఆమెను కాపాడేందుకు వైధ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. ఆ సమయంలో చిన్న హెల్త్‌ ఇష్యూ వచ్చినా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో లతా మంగేష్కర్ తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ను ఎదుర్కొంటూ ఉన్నారని వైద్యులు అంటున్నారు. ఆమె మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి బయటకు రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Tags:    

Similar News