RC15 బడ్జెట్‌ నియంత్రణపై శంకర్‌ ను ఒప్పించిన దిల్ రాజు..?

Update: 2021-09-29 11:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఇది చరణ్ కెరీర్ లో 15వ చిత్రం.. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న మైలురాయి 50వ చిత్రం. అందుకే ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ ప్రొడక్షన్ లో అత్యధిక బడ్జెట్ లో తీసే ప్రాజెక్ట్ గా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు.

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందే #RC15 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందించనున్నారు. దీని కోసం దర్శకుడు శంకర్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ అడిగారని ప్రచారం జరుగుతోంది. అయితే దిల్ రాజు మాత్రం ఈ సినిమాని అంతకంటే తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసేలా శంకర్‌ ని ఒప్పించారట. ఈ ప్రాజెక్ట్ ని 170 కోట్లలో తీసిచ్చేలా అగ్రిమెంట్ రాసుకున్నారట. అయినప్పటికీ ఇది దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న అత్యధిక బడ్జెట్ సినిమా అనే చెప్పాలి

RC15 చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ ప్రభుత్వోద్యోగులుగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తమిళ నటుడు ప్రభు ని కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు టాక్.

ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రముఖ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి - అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. జానీ మాస్టర్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

RC15 చిత్రంతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలని శంకర్ చూస్తున్నారు. 'స్నేహితుడు' 'ఐ' '2.0' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దర్శకుడి స్థాయికి తగ్గ వసూళ్ళు రాకపోవడం.. 'ఇండియన్' సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టి ఆగిపోవడంతో.. శంకర్ ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కసి మీదున్నాడు. మరోవైపు చరణ్ సైతం.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించాలనుకున్న డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ అవ్వడంతో హ్యాపీగా ఉన్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం చిరంజీవి తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది తండ్రీ కొడుకులు కలిసి చేస్తున్న మొదటి పూర్తి స్థాయి సినిమా. ఓ సాంగ్ మినహా ఈ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే జనవరి నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో వస్తున్న చెర్రీ.. ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News