ప్ర‌భాస్ సినిమా కు స్ఫూర్తి ఆ మూవీనా?

Update: 2022-02-24 02:30 GMT
రామాయ‌ణం.. ఇదొక ఎవ‌ర్ గ్రీన్ స్టోరీ. త‌రాలు మారినా.. ఈ క‌థ‌ని ఇప్ప‌టికీ చెప్పుకుంటూనే వున్నాం. వుంటాం. వెండితెర‌పై రామాయ‌ణం ఆధారంగా దేశ వ్యాప్తంగా వున్న ప‌లు భాష‌ల్లో వంద‌ల సినిమాలొచ్చాయి. అయినా ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఈ క‌థ కొత్త‌గానే వుంటుంది.

అందుకే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే క‌థ‌ని మ‌న వాళ్లు చెబుతూ వ‌స్తున్నారు. చెప్పిన ప్ర‌తీసారి కొత్త గా అందులోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తున్నారు. తాజాగా రామాయ‌ణ గాథతో తెర‌పైకి `ఆది పురుష్` పేరుతో ఊహ‌కంద‌ని స‌న్నివేశాల‌తో ఓ భారీ చిత్రం వ‌స్తున్న‌ విష‌యం తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఇంత వ‌ర‌కు వ‌చ్చిన రామాయ‌ణ గాథ‌ల‌కు మించి వెండితెర‌పై సరికొత్త‌గా ఆవిష్క‌రించ‌బోతున్నారు. ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ఖ్యాత బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ దాదాపు 400 కోట్ల భారీ వ్య‌యంతో నిర్మిస్తోంది. కృతిస‌న‌న్ హీరోయిన్ గా సీతమ్మ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీకర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి.

అమీర్ ఖాన్ న‌టిస్తున్న `లాల్ సింగ్ చ‌ద్దా` చిత్రం ఆగ‌స్టు 11న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ మూవీ రిలీజ్ ని చిత్ర బృందం వాయిదా వేసింది. సెప్టెంబ‌ర్ లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు వున్న‌ట్టుగా చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి అంకురార్ప‌ణ ఎలా జ‌రిగిందో చిత్ర ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ తాజాగా వెల్ల‌డించం ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌ప‌నీస్ సినిమా స్ఫూర్తితో ఈ చిత్ర క‌థ‌ని రాశాన‌ని ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ తెలిపాడు.

జ‌ప‌నీస్ డైరెక్ట‌ర్ యుగోసాకో రామాయ‌ణ క‌థ స్ఫూర్తితో రూపొందించిన `ఏ ప్రిన్స్ ఆఫ్ లైట్` అనే సినిమా చూశా. నాకు బాగా న‌చ్చింది. ఒక విదేశీయుడు మ‌న పురాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాన్ని రూపొందించాడు. మ‌నం ఎందుకు అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కూడదు అనిపించింది. అందుకే ఆ స్ఫూర్తితో `ఆది పురుష్` క‌థ‌ని రాయ‌డం మొద‌లుపెట్టాను. రామాయ‌ణానికి స‌రికొత్త వెర్ష‌న్ గా ఈ చిత్ర క‌థ‌ని రాశాను` అని `ఆది పురుష్‌` క‌థ ఎలా మొద‌లైందో తెలిపారు.    

క‌థ రాస్తున్న‌ప్పుడే ఇందులో రాముడిగా ప్ర‌భాస్ ని త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేద‌ని, క‌థ పూర్త‌య్యాక ప్ర‌భాస్ కు ఫోన్ లో రెండు మూడు సీన్ లు చెప్పాన‌ని, అయితే క‌థ మొత్తం డైరెక్ట్ గా వింటానని త‌ను ముంబై వ‌చ్చి క‌థ విన్నాడ‌ని.. క‌థ విన్న ప్ర‌భాస్ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌న్నారు. అంతే కాకుండా ప్ర‌భాస్ లా  ఈ సినిమా భారాన్ని మ‌రో హీరో మోయ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడు ఓం రౌత్‌.
Tags:    

Similar News