శివ కార్తికేయన్ ఈ రేంజ్ కు వస్తాడనుకోలేదు: రెజీనా
ఎస్ఎంఎస్(శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా కస్సాండ్రా మొదటి సినిమాతో మంచి నటనతో అందరినీ ఆకట్టుకుంది
ఎస్ఎంఎస్(శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా కస్సాండ్రా మొదటి సినిమాతో మంచి నటనతో అందరినీ ఆకట్టుకుంది. అమ్మడు తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినా అవేమీ తనకు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. రెజీనా తెలుగులో ఆఖరిగా కనిపించిన సినిమా నేనే నా.
ఆ సినిమా తర్వాత రెజీనా మరో తెలుగు సినిమాలో కనిపించింది లేదు. టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో అమ్మడు కోలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరుస అవకాశాలందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది రెజీనా. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెజీనా అజిత్ తో కలిసి విడాముయార్చిలో స్క్రీన్ షేర్ చేసుకుంది.
అజిత్ కుమార్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన విడాముయార్చి సినిమాలో అర్జున్ కీలక పాత్ర పోషించారు. అర్జున్‌కు జోడీగా రెజీనా కనిపించనున్నట్టు తెలుస్తోంది. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన విడాముయార్చి ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో రెజీనా చాలా చురుగ్గా పాల్గొంటుంది.
ఈ నేపథ్యంలో రెజీనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శివ కార్తికేయన్ ఇంత పెద్ద హీరో అవుతాడని తాను అసలు అనుకోలేదని, తాను, శివ కలిసి కేడి బిల్లా కిల్లాడీ రంగా సినిమా చేసినట్టు, ఆ సినిమా రిలీజై 12 ఏళ్లవుతుందని రెజీనా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
శివ కార్తికేయన్ ఆ సినిమా టైమ్ లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని, ఆయనలో ఎలాంటి మార్పు లేదని, అలాంటప్పుడు ఆయన ఈ స్థాయి హీరో ఎలా అయ్యాడనేది తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, సినీ ఇండస్ట్రీలో అదంతా చాలా కష్టమని ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన శివ కార్తికేయన్ మనిషిగా మాత్రం ఏం మారలేదని ఆయన చాలా గొప్పోడని రెజీనా ఈ సందర్భంగా తెలిపింది.