శివాజీ.. పర్ఫెక్ట్ టైమ్ లో పవర్ఫుల్ క్యారెక్టర్!

టాలీవుడ్‌లో ఎంతో టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు దొరకక వెనుకబడ్డ సీనియర్ నటులు చాలామందే ఉన్నారు.;

Update: 2025-03-13 13:30 GMT

టాలీవుడ్‌లో ఎంతో టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు దొరకక వెనుకబడ్డ సీనియర్ నటులు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన శివాజీ, గతంలో హీరోగా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, సరైన సక్సెస్‌లు లేకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించినా, 2010 తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి మళ్లిపోయారు. దీంతో సినీ పరిశ్రమకు దూరమైన శివాజీ, మళ్లీ వెండితెరకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు.

కానీ ఇటీవలే ఆయన నటించిన వెబ్‌సిరీస్ 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ బాగా హిట్ అవ్వడంతో మళ్లీ తనకి మంచి డిమాండ్ వచ్చింది. అయితే, ఇటీవల శివాజీ నటించిన కోర్ట్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రధానంగా అతని క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మంగపతి అనే క్యారెక్టర్ లో సినిమాలో విలన్‌గా నటించిన శివాజీ, తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ షాక్‌కు గురి చేశారు.

తండ్రిగా పిల్లల కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడే ఓ కుటుంబనాయకుడి పాత్రను పోషిస్తూ, అదే సమయంలో కూతురిని అతి జాగ్రత్తగా పెంచే వ్యక్తిగా కూడా హైలెట్ అయ్యాడు. అసహనంతో కూతురి ప్రేమ విషయంలో అతను తీసుకున్న నిర్ణయాలను దర్శకుడు పవర్ఫుల్ గా చూపించాడు. కూతురి ప్రేమ వ్యవహారం విషయంలో ఎంతకైనా తెగించే పాత్రను ఒదిగిపోయేలా చేశారు. దర్శకుడు రామ్ జగదీష్ తను ట్రైలర్‌లో చూపించిన మంగపతి క్యారెక్టర్‌ను అసలు సినిమాలో మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేయడం విశేషం.

ముఖ్యంగా హర్షవర్ధన్‌తో కలిసిన సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అతిగా ఆవేశపడే, మనోభావాలకు గురయ్యే మంగపతి పాత్రలో శివాజీ చూపించిన నటన కచ్చితంగా అతని సెకండ్ ఇన్నింగ్స్‌కు గొప్ప లాంచ్‌గా నిలుస్తుంది. గతంలో శ్రీకాంత్, జగపతిబాబు వంటి హీరోలు విలన్‌గా మళ్లీ కెరీర్‌ను నిలబెట్టుకున్నట్లుగానే, శివాజీ కూడా విలన్‌గా మంచి క్రేజ్‌ను తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అసలు విలన్‌గా తాను ఫిట్ అవుతానని నాని నమ్మడమే ఆశ్చర్యం కలిగించిందని శివాజీ స్వయంగా చెప్పడం ఆసక్తికరం. ఏదేమైనా ఆ నమ్మకాన్ని శివాజీ నెరవేర్చారు. గతంలో ఎన్నో క్యారెక్టర్ రోల్స్ చేసినప్పటికీ, ఈసారి నటన పరంగా కొత్త కోణాన్ని చూపించగలిగాడు. ముఖ్యంగా, కేవలం డైలాగ్ డెలివరీ మాత్రమే కాకుండా, తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా పాత్రను మరింత ప్రభావవంతంగా చేశారు.

ఇప్పటికే కోర్ట్ సినిమా పట్ల మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా మూడ్‌కు తగ్గట్టుగా శివాజీ నటన చాలా సహజంగా ఉండటంతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ కూడా బాగా కలిగింది. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, మంగపతి క్యారెక్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా రిలీజ్ తర్వాత ఈ క్యారెక్టర్ గురించి మరింత చర్చ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం శివాజీ లాంటి సీనియర్ నటులకు ఇది పర్ఫెక్ట్ టైమ్. మంచి విలన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటే వెబ్ సీరీస్, బిగ్ సినిమాలతో బిజీ కావచ్చు. మరి ఈ క్రేజ్ ను ఆయన ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News