రన్యారావు.. విమానాశ్రయ సెక్యూరిటీ నుంచి ఎస్కేప్ ప్లాన్!
సుమారు 15 కోట్ల విలువ చేసే బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు.;
కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు సంచలనమైన సంగతి తెలిసిందే. ఈకేసులో డిజిపి అయిన ఆమె సవతి తండ్రి పాత్ర ఏదైనా ఉందా అనే అనుమానంతో అతడిపైనా ఆరాలు తీస్తున్నారు. రన్యా స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు భద్రతా తనిఖీలను దాటవేసి ప్రోటోకాల్, అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులో విమానాశ్రయంలో భద్రతా తనిఖీలను రన్యా ఎలా దాటవేసారు? ఉన్నత అధికారులకు కేటాయించిన ప్రత్యేకాధికారాలను ఆమె ఎలా ఉపయోగించుకుంది? ఎలా దుర్వినియోగం చేసింది? ఇందులో కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రామచంద్రరావు పాత్ర ఉందా? అనే దానిపై ఒక రిపోర్ట్‌ను వారంలోపు సమర్పించాలని విచారణ అధికారులు కోరారు. విచారణ కోసం సంబంధిత అధికారులకు అవసరమైన అన్ని పత్రాలు, సహాయాన్ని అందించాలని ఉన్నత పోలీసు అధికారులు, కర్ణాటక కార్యదర్శులు, సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖను ఆదేశించారు.
సుమారు 15 కోట్ల విలువ చేసే బంగారాన్ని దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. రన్యా కోర్టులో జడ్జి ముందు విలపించారు. తాను మానసికంగా కుంగిపోయానని అన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కస్టడీలో తనను మాటలతో హింసించి, బెదిరించారని రన్యా రావు పేర్కొన్నారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రన్యా రావుకు దుబాయ్‌లో బలమైన సంబంధాలు ఉన్నాయని, ఆమె బంగారు కడ్డీలను విమానాశ్రయంలోకి అక్రమంగా రవాణా చేసి, ఆపై వాటిని ఆమెకు అప్పగించిందని అనుమానిస్తోంది.
దర్యాప్తు ఏజెన్సీ వివరాల ప్రకారం.. దుబాయ్‌లోని విమానాశ్రయం లోపల రన్యా రావు తన తొడలు, పిరుదులు, నడుము చుట్టూ బంగారు కడ్డీలను చుట్టుకుంది. ఆమె శరీర భాగాలకు టేప్ , క్రేప్ బ్యాండేజ్‌ను ఉపయోగించి బంగారం కడ్డీలను చుట్టిందని వారు చెప్పారు. ఆమె క్యారియర్ మాత్రమే కాదు.. ఈ సంబంధంలో కూడా పాల్గొంటుందని అనుమానిస్తున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత, ఒక రాష్ట్ర ప్రోటోకాల్ అధికారి ఇమ్మిగ్రేషన్‌కు వెళ్లి ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం రన్యా రావు లగేజీని తీసుకుంటారు. ఈ విధంగా ఆమె ల్యాండింగ్ తర్వాత విమానాశ్రయంలో మెటల్ డిటెక్టర్లను తనిఖీల నుంచి బయటపడుతుంది. భద్రతా సిబ్బందికి అనుమానం ఉంటే తప్ప ల్యాండింగ్ తర్వాత ప్రజలను పూర్తిగా స్కాన్ చేయరు. ఇది ప్రోటోకాల్ దుర్వినియోగానికి సంబంధించిన స్పష్టమైన కేసు! అని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రన్యారావు వాంగ్మూలంలోనే నేరారోపణ వివరాలు ఉన్నాయని డిఆర్ఐ తెలిపింది. రన్యారావు తనపై వచ్చిన చాలా ఆరోపణలను ఖండించలేదని పేర్కొంది. ఈ కేసులో ఇతరులు కూడా ఉన్నారు. దానిపై ఆమెను మరింత ప్రశ్నించాల్సిన అవసరం ఉందని డిఆర్ఐ వాదించింది. రన్యా రావు మొబైల్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ అవి లాక్ చేసి ఉన్నందున డిఆర్ఐ ఇంకా వాటిని యాక్సెస్ చేయలేదు. నటి ముఖంపై గాయాల గుర్తులు కూడా ఉన్నాయని ఏజెన్సీ తెలిపింది.
రన్యా రావు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రామచంద్రరావు సవతి కూతురు. ఆమె రెగ్యులర్ గా దుబాయ్‌కు వెళ్లడం వల్ల ఇంటెలిజెన్స్ రాడార్‌లో చాలా కాలంగా ఉంది. ఒక సంవత్సరంలో 30 సార్లు దుబాయ్‌కు వెళ్లిందని, కేవలం 15 రోజుల్లో నాలుగు సార్లు వెళ్లిందని పరిశోధన అధికారులు ఆరోపించారు. బంగారంతో రెడ్ హ్యాండెడ్ గా రన్యారావును అరెస్ట్ చేసారు. అరెస్టు చేసిన తర్వాత బెంగళూరులోని ఆమె ఇంటి నుండి బెంగళూరు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దాడుల సమయంలో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. రన్యారావు జతిన్ హుక్కేరిని వివాహం చేసుకున్నారు. అతడు కూడా తనతో దుబాయ్‌కు వెళ్లేవాడు. అతడిపైనా విచారణ జరగనుందని కథనాలొచ్చాయి.