త‌మ్ముడు త‌గ్గేదేలే.. అన్న త‌గ్గిపాయే

Update: 2022-02-13 00:30 GMT
ఏపీ ప్ర‌భుత్వం త‌గ్గించిన సినిమా టికెట్ రేట్ల కార‌ణంగా గ‌త కొన్ని నెల‌లుగా టాలీవుడ్ బిగ్ మూవీస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. సినిమా థియేట‌ర్ల సీజ్ తో పాటు ప‌లు స‌మ‌స్య‌ల్ని టాలీవుడ్ ఏపీలో ఎదుర్కొంటోంది. అంతే కాకుండా ఇదే సంద‌ర్భంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు తెలుగు సినీ నిర్మాత‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఏపీ ప్ర‌భుత్వానికి, టాలీవుడ్ కు మ‌ధ్య దూరం పెరిగింది. అంత‌కు ముందు ఏపీ ప్ర‌భుత్వ నేత‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపాయి.

`రిప‌బ్లిక్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ వైసీపీ నేత‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏ విష‌యంలోనూ త‌గ్గేదేలే అంటూ దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. వైసీపీ నేత‌ల‌తో పాటు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పై కూడా ప‌వ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో టాలీవుడ్ వ‌ర్గాల్లో భ‌యం మొద‌లైంది. పవ‌న్ వ్యాఖ్య‌ల కార‌ణంగా టాలీవుడ్ ని టార్గెట్ చేస్తార‌ని భ‌య‌ప‌డ్డారు. ఆ త‌రువాత వైసీపీ ఎమ్మెల్యే టాలీవుడ్ నిర్మాత‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం.. దానికి కౌంట‌ర్ ఇస్తూ నిర్మాత‌ల మండ‌లి స‌ద‌రు ఎమ్మెల్యేపై ఘాటుగా స్పందిస్తూ ఓ లేఖ‌ని విడుద‌ల చేయ‌డంతో వివాదం మ‌రింత‌గా ముదిరింది.

ప‌రిస్థితి చేయిదాటేలా వుంద‌ని గ‌మ‌నించిన చిరంజీవి త‌న‌కు తానుగా వెళ్లి ఏపీ ముఖ్య‌మంత్రితో భేటీ కావ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. భోజ‌న విరామ స‌మ‌యంలో అపాయింట్ మెంట్ ఇచ్చిన సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆ స‌మ‌యంలో చిరంజీవితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. కానీ ఏమీ తేల్చ‌లేదు. దీనిపై మ‌రో సారి భేటీ అవుతార‌ని వార్త‌లు వినిపించాయి. పెద్ద చిత్రాల రిలీజ్ డేట్ ల‌ని తాజాగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మ‌రోసారి చిరంజీవి ఏపీ ముఖ్య‌మంత్రితో ప్ర‌త్యేకంగా భేటీ కావ‌డం తెలిసిందే.

ఈ భేటీలో ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ స్టార్ హీరోలు ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, నిర్మాత నిరంజ‌న్ రెడ్డి.. పోసాని.. ఆర్. నారాయ‌ణ మూర్తి, అలీ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ భేటీ అనంత‌రం సీఎం సానుకూలంగా స్పందించార‌ని చిరుతో పాటు ప్ర‌భాస్‌, మ‌హేష్ అన్నారు. కానీ తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన వీడియోలో చిరంజీవి ఏపీ సీఎంకు చేతులు జోడించి వేడుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ విరుచుకుప‌డ్డారు. ఇంత‌లా ప్ర‌ధేయ‌ప‌డ‌టం ఎందుక‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

చిరు తాజా వీడియోపై ఇండ‌స్ట్రీలోని చాలా మంది మాత్రం పెద‌వి విరుస్తున్నారు. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌గ్గేదేలే అంటుంటే అన్నేమో త‌గ్గిపాయె అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప‌వ‌న్ రంకెలేస్తుంటే చిరు ఎందుకు త‌గ్గుతున్నారు అన్న‌ది మాత్రం ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. త‌మ్ముడి కార‌ణంగా ఇండ‌స్ట్రీ ఇబ్బందుల్లో ప‌డ‌కూడ‌ద‌నే చిరు ఏపీ సీఎం ముందు త‌గ్గిపోతున్నారా? అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న వాద‌న‌.
 
    
    
    

Tags:    

Similar News