కిక్కివ్వ‌ని మెగా హీరో పంచ్

Update: 2022-04-12 08:30 GMT
టాలీవుడ్ చిత్రాల‌కు ఇప్ప‌డు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్ప‌డింది. మార్కెట్ కూడా రికార్డు స్థాయిలో జ‌రుగుతుండ‌టంతో మ‌న హీరోలు అత్య‌ధికంగా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. అంతే కాకుండా త‌మ‌ని అభిమానించే ప్రేక్ష‌కులు, అభిమానుల కోసం ఎలాంటి ప్ర‌యోగాలైనా చేయ‌డానికి వెనుకాగ‌టం లేదు. అంతే కాకుండా స్టోరీ డిమాండ్ మేర‌కు ఎంత రిస్క్ అయినా స‌రే భ‌రించ‌డానికి ముందు కొస్తున్నారు. ఇక న‌చ్చిన పాత్ర కోసం అది డీ గ్లామ‌ర్ రోల్ అయినా సరే దాని కోసం ఎంత వ‌ర‌కు శ్ర‌మించాలో అంత వ‌ర‌కు శ్ర‌మిస్తున్నారు.

ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఇటీవ‌ల స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బ‌న్నీ 'పుష్ప‌' చిత్రం కోసం డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి చాలా వ‌ర‌కు అడ‌వుల్లో పుష్ప‌రాజ్ పాత్ర కోసం చాలా శ్ర‌మించారు. గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో బ‌న్నీ శ్ర‌మ ఫ‌లించింది. ఆయ‌న‌ని అనూహ్యంగా పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టింది.

ఇదే త‌ర‌హాలో క్యారెక్ట‌ర్ డిమాండ్ ని బ‌ట్టి మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌ఠోరంగా శ్ర‌మించి చేసిన చిత్రం 'గ‌ని'. బాక్సింగ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం కోసం బాక్స‌ర్ లుక్ లోకి రావ‌డానికి వ‌రున్ తేజ్ చాలా శ్ర‌మించారు. కొంత కాలం ప్ర‌త్యేకంగా బాక్సింగ్ లో శిక్ష‌ణ కూడా తీసుకున్నారు. భారీ అంచ‌నాలు పెట్టుకుని ఒళ్లు హూనం చేసుకుని న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. తొలి రోజు తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపించ‌లేదు. విడుద‌లైన అన్ని చోట్ల నుంచి యునానిమ‌స్ గా ఈ మూవీకి డివైడ్ టాక్ వినిపించి షాకిచ్చింది.

ఏప్రిల్ 8న బారీ స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం 3 రోజుల‌కు గానూ సాధించిన వ‌సూళ్లు ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు మేక‌ర్స్ కి షాకిస్తున్నాయి. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి దాదాపుగా 4 కోట్ల‌కు మించి షేర్ రాక‌పోవ‌డం భారీ షాక్ గా చెబుతున్నారు. దాదాపు భారీ స్టార్ కాస్టింగ్ తో 30 కోట్ల బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాంటి ఈ మూవీ కేవ‌లం 4 కోట్ల షేర్ ని మాత్ర‌మే ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో రాబ‌ట్ట‌డం ప‌లువురిని విస్మ‌యానికి గురిచేస్తోంది.

కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్దూ ముద్ద నిర్మించారు. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్ర బిజినెస్ భారీ స్థాయిలోనే జ‌రిగినా ఆ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోవ‌డంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు భారీ న‌ష్టాలు రావ‌డం ఖాయం అనే కామెంట్ లు ట్రేడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి వ‌సూళ్ల ప‌రిస్థితి ఇలా వుంటే తాజాగా ఈ చిత్రానిక ఇమ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోంది.

ఇప్ప‌టికే ఈ మూవీ ని కొన్ని థియేట‌ర్ల‌లో నుంచి తొల‌గిస్తున్నారు. బుధ‌వారం విజ‌య్ 'బీస్ట్‌' రిలీజ్ కాబోతుండ‌గా.. మ‌రో రెండు రోజుల్లో 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' రిలీజ్ కానున్న నేప‌థ్యంలో మ‌రిన్ని థియేట‌ర్ల నుంచి 'గ‌ని' చిత్రాన్ని తొల‌గించి ఆ థియేట‌ర్ల‌ని ఈ రెండు చిత్రాల‌కు కేటాయిస్తున్నార‌ట‌. ఇది నిజంగా వ‌రుణ్ తేజ్ ఫ్యాన్స్ కి చేదు వార్తే అని, ఈ రెండు సినిమాతో 'గ‌ని' క‌లెక్ష‌న్స్ చాలా వ‌ర‌కు డ్రాప్ కావ‌డం ఖాయం అని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.
Tags:    

Similar News