ఆ ద‌ర్శ‌కుడితో పెట్టుకుంటే అంతే

Update: 2018-12-24 07:38 GMT
వ‌రుస‌గా సినిమాలు ప్రారంభిస్తాడు.. భారీ మ‌ల్టీస్టార‌ర్లు అంటాడు.. బ‌హుభాషా చిత్రాలు తీస్తున్నాన‌ని చెబుతాడు.. ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచిపోతుంటాయి.. కానీ సినిమా మాత్రం ఇన్ టైమ్‌లో రిలీజ్ కాదు.. చివ‌రికి సినిమా రిలీజై క్లాసిక్ అనిపించుకున్నా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌వ‌ర‌కూ నెగ్గుకొస్తుందో తెలీదు.. అయినా అత‌డు ఇండ‌స్ట్రీ బెస్ట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డు.. ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శ‌కుడు? ప్ర‌త్యేకంగా గుర్తు చేయాలా? ఆయ‌నే ది గ్రేట్ గౌత‌మ్ మీన‌న్. గొప్ప టెక్నీషియ‌న్‌ గా, గొప్ప అభిరుచి ఉన్న వాడిగా గౌత‌మ్ మీన‌న్ ప‌నిత‌నం గురించి అంద‌రికీ తెలుసు.

అత‌డు తీసిన చెలి, ఘ‌ర్ష‌ణ (కాక్క కాక్క‌), రాఘ‌వ‌న్- సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్- సాహ‌సం శ్వాస‌గా సాగిపో- ఎంత వాడు గానీ(ఎన్నై అరిందాల్),.. ఇవ‌న్నీ అంద‌మైన క‌విత‌ల్లాంటివి. చ‌దివే కొద్దీ మ‌ధురానుభూతుల్ని మిగిల్చే క‌విత‌ల్లా సాగిపోతాయి. బాక్సాఫీస్ ఫ‌లితం మాట దేవుడెరుగు.. ఒక కావ్యాన్ని చ‌దువుతున్నామ‌ని ఫీల‌వ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు. అయితే గౌత‌మ్ మీన‌న్ ఇటీవ‌లి కాలంలో ప‌లువురికి చుక్క‌లు చూపించ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది. అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే భారీ చిత్రాలు ఆన్ సెట్స్ ఉన్నాయి. వీటికి ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కులు ఉండ‌డంతో అవేవీ రిలీజ్‌ ల‌కు నోచుకోక‌పోవ‌డం స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. స‌రైన ప్లానింగ్, ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డంతోనే ఇలా అవుతోందా? అంటూ ఏళ్ల‌కు ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు ఎంతో ఫీల‌వుతున్నారు.

ప్ర‌స్తుతం గౌత‌మ్ త‌ర‌కెక్కిస్తున్న మూడు సినిమాల ప‌రిస్థితి ఏంటో ప‌రిశీలిస్తే ఈ సంగ‌తులు అర్థ‌మ‌వుతాయి. ధనుష్‌‌- ఎన్నై నొక్కి పాయుమ్ తోటా, విక్రమ్‌- ధృవ నక్షత్రం ప‌రిస్థితేంటో అర్థం కాదు. యువ‌ద‌ర్శ‌కుడు కార్తీక్ నరేన్ తో గౌతమ్ నిర్మిస్తున్న `నరగాసురన్` స‌న్నివేశం అదే. వీటితో పాటు జ‌య‌ల‌లిత‌ పై గౌత‌మ్ మీన‌న్ ఓ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తుండ‌డం, చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈలోగానే గౌత‌మ్ మీనన్ భారీ వెబ్ సిరీస్ లు తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. ఆ క్ర‌మంలోనే భ‌విష్య‌త్ వెబ్ సిరీస్ ల‌దే అన్న కొత్త ప‌ల్ల‌విని అందుకోవ‌డం పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆన్ సెట్స్ ఉన్న సినిమాలు రిలీజ్ చేయ‌కుండా గౌత‌మ్ ఇలా ఎందుకు అన్నిట్లో వేలు పెడుతున్నాడు? అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News