ఆచార్యా.. ఎంత పని చేశావయ్యా..!

Update: 2022-04-25 08:31 GMT
మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ''ఆచార్య''. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా సందడి చేయనున్నారని అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సినిమా నుంచి కాజల్ ను తొలగించడంతో పాటుగా ఆమె నటించిన సన్నివేశాలను కూడా తొలగించారనేది కొందరికి మాత్రమే తెలిసిన విషయం.

'ఖైదీ నెం. 150' తర్వాత చిరంజీవి - కాజల్ కాంబోలో రెండో సినిమా అనే సరికి అందరిలో ఆసక్తి ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే 'లాహే లాహే' పాటలో కనిపించి చందమామ ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత కాజల్ - గౌతమ్ కిచ్లు జంటకు సెట్ లో శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను కూడా వదిలారు. అయితే ఆ తర్వాత ఆమెను సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో కాజల్ కు చోటు కల్పించలేదు. కాజల్ కూడా 'ఆచార్య' సినిమాను ప్రమోట్ చేయలేదు.. చిత్ర బృందం నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎక్కడా ఆమె పేరు వినిపించడం లేదు. ఆమె సీన్స్ డిలీట్ చేసారని కాజల్ అలిగిందని.. అందుకే దూరంగా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి.

అదే సమయంలో కాజల్ ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి.. ప్రమోషన్స్ చేయడానికి వీలు పడలేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో అసలు 'ఆచార్య' సినిమాలో కాజల్ ఉందా లేదా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈ విషయంపై కొరటాల శివ స్పందించారు. ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ను తొలగించినట్లు తెలిపారు.

అన్ని కమర్షియల్ సినిమాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా హీరోకి జోడీగా హీరోయిన్ ఉండాలని భావించామని.. అయితే కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదనిపించిందన్నారు. అంతేకాదు అంత పెద్ద హీరోయిన్ తో ఏదొక పాత్ర చేయించడం భావ్యం కాదనిపించి.. ఈ విషయాన్ని కాజల్ కు చెప్పి తన పాత్రని తొలిగించినట్లు దర్శకుడు వెల్లడించారు.

కొరటాల మాట్లాడుతూ.. ''ధర్మస్థలిలో ఉండే ఓ చాలకీ ఆమ్మాయిగా కాజల్ పాత్రని క్రియేట్ చేశాం. 4 రోజులు షూట్ చేశాం. పాత్ర రాసుకున్నాం.. షూట్ చేశాం కానీ.. ఆచార్య పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే విషయంపై నాకు సందేహం కలిగింది. పేపర్ మీద పెట్టినప్పుడు.. షూటింగ్ చేసినప్పుడు కూడా ఇది అలానే ఉంది''

''అప్పుడే కరోనా రావడంతో కొన్ని రోజులపాటు ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదనిపించింది. సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్రను సృష్టించి అంత పెద్ద హీరోయిన్ తో చేయించడం భావ్యం కాదనిపించింది. అలాగే ఆ పాత్రకు పాటలు కూడా లేవు, సరైన ముగింపు కూడా లేదు''

''ఇవన్నీ ఆలోచించి ఓసారి చిరంజీవి గారితో ఇదే విషయాన్ని చెప్పాను. కథకు ఏది అవసరమో అదే చెయ్. నీకున్న సందేహాన్ని అందరితో షేర్ చేసుకో అని ఆయన చెప్పారు. అదే విషయాన్ని కాజల్ కి ఎక్సప్లైన్ చేసాను. ఆమె అర్ధం చేసుకుని.. 'నా గురించి ఇంతగా ఆలోచించి డెసిజన్ తీసుకున్నందుకు థాంక్స్. నేను మీ అందర్నీ మిస్ అవుతున్నా' అని అన్నారు. సో అలా ఆమె ఈ చిత్రంలో లేదు" అని వివరించారు.

అయితే ప్రస్తుతం అన్ని మీడియాలలో ప్రదర్శించబడుతున్న 'లాహే లాహే' సాంగ్ లో కాజల్ అగర్వాల్ కనిపిస్తారా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనని కొరటాల శివ పేర్కొన్నారు. రిలీజ్ కు మూడు రోజుల ముందు ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు కానీ.. ఇదే ఇప్పుడు కాజల్ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తోంది.

బిగ్ స్క్రీన్ పై మరోసారి చిరు - చందమామల జోడీని చూడాలని ఆశ పడిన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ తో కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఇలా సినిమా నుంచి తొలగించడం కరెక్ట్ కాదని.. ఇది ఆమెను అవమానించడమే అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

స్క్రిప్టు దశలోనే హీరోయిన్ పాత్ర మీద డౌట్ ఉన్నప్పుడు.. అప్పుడే కాజల్ ను ఎంపిక చేయకుండా ఉండే బాగుండేదని.. పాత్రకు ప్రాధాన్యత లేదంటూ అర్థాంతరంగా ఆమెను సినిమా నుంచి తొలగించడం సమంజసం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్.. ఇలా అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న కాజల్ కు ఇలాంటి అనుభవం ఎదురవడం దురదృష్టకరమని అంటున్నారు.

ఏదేమైనా పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తెలుగులో చేసిన 'ఆచార్య' చిత్రంలో ఆమె లేకపోవడం.. ఈ విషయం విడుదలకు మూడు రోజుల ముందు బయటకు తెలియడం అనేది చందమామ ఫ్యాన్స్ ను నిరాశ పరిచే విషయమనే చెప్పాలి.
Tags:    

Similar News