ఇంత‌కీ ఈ సుంద‌రం మాస్ట‌ర్ ఎవ‌రు?

Update: 2022-03-23 10:35 GMT
నిజం కంటే వేగంగా ఈ రోజుల్లో అబ‌ద్దం ప్ర‌పంచాన్ని చుట్టేస్తోంది. నిజం ఇద‌ని తెలిసేలోపు అబ‌ద్దం ప‌తాక స్థాయికి చేరుకుని నిజాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. నిజం గ‌డ‌ప‌దాటేలోపే అబ‌ద్ధం ప్ర‌పంచ వ్యాప్తంగా పాకిపోతోంది. సోష‌ల్ మీడియా వ‌చ్చేశాక ఇలాంటి వుదంతాలు, విచిత్రాలు ఎన్నో జ‌రుగుతున్నాయి. అలాంటి ఓ విచిత్ర‌మే తాజాగా జ‌రిగి బ్ర‌తికున్న వ్య‌క్తి చ‌నిపోయాడంటూ అపోహ‌ని క‌లిగించింది. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ సుంద‌రం మాస్ట‌ర్ చ‌నిపోయారంటూ ఓ వార్త వైర‌ల్ అయింది.

10,000 పాట‌ల‌కు డ్యాన్స్ కంపోజ్ చేసిన సుంద‌రం మాస్ట‌ర్ చ‌నిపోవ‌డం ఏంట‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. చాలా మంది ఈ వార్త నిజ‌మేనేమో అనుకుని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తూ పోస్ట్ లు చేశారు. అయితే చ‌నిపోయిన సుంద‌రం మాస్ట‌ర్ ప్ర‌భుదేవా తండ్రి కాద‌ని, ఆయ‌న వేరే వ్య‌క్తి అని తెలియ‌డంతో అంతా నాలుక క‌రుచుకున్నారు. ఎంత‌లో ఎంత పొర‌పాటు జ‌రిగింద‌ని వాపోయారు. అయితే ఇదే సంద‌ర్భంగా అస‌లు చ‌నిపోయిన సుంద‌రం మాస్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆయ‌న ప్ర‌ముఖ రంగ‌స్థ‌ల న‌టులు, ద‌ర్శ‌కుడని, తెలుగు నాట‌క‌రంగంలో ప్ర‌ఖ్యాతి చెందిన వ్య‌క్తి అని తెలిసింది. ఆయ‌న అసలు పేరు త‌ల్లావ‌జ్జుల సుంద‌రం మాస్టారు. 1950లో ఒంగోలులో జ‌న్మించిన ఆయ‌న బీఎస్సీ చ‌దివిన త‌రువాత ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో రంగ‌స్థ‌ల క‌ళల విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.

అప్ప‌టి నుంచి ఇక్క‌డే వుంటూ నాట‌రంగానికి సేవ‌లు చేస్తున్నారు. రెండు వంద‌ల‌కు పైగా నాట‌కాల్లో న‌టించారు. సోమ‌వారం గుండెపోటు రావ‌డంతో సుంద‌రం మాస్టారు తుదిశ్వాస విడిచారు.

అయితే ఈయ‌న గురించి తెలియ‌ని వాళ్లు ప్ర‌భుదేవా తండ్రి సుంద‌రం మాస్టారు చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో ప్ర‌భుదేవా తండ్రి సుంద‌రం మాస్టారు బాగానే వున్నార‌ని, ఆయ‌న‌కు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని, ఆయ‌న ప్ర‌స్తుతం క్షేమంగానే వున్నార‌ని, ఆయ‌న చ‌నిపోయారంటూ వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.

జెమినీ గ‌ణేష‌న్‌, సావిత్రి న‌టించిన త‌మిళ చిత్రం `కొంజుమ్ సొలంగై` తో డ్యాన్స్ మాస్ట‌ర్ తంగ‌ప్ప‌న్ వ‌ద్ద అసిస్టెంట్ డ్యాన్సర్ గా సుంద‌రం మాస్టారు కెరీర్ ప్రారంభించారు. 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆయ‌న‌ యాక్టీవ్ గా సినిమాల‌కు కొరియోగ్ర‌ఫీని అందించారు. ప్ర‌స్తుతం కొంత కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
Tags:    

Similar News