అంత టాలెంట్ ఉంటే ఇంత పిరికితనం ఉండేది కాదేమో!

Update: 2022-03-14 23:30 GMT
తెలుగు సినిమా పాట ఎప్పటికప్పుడు కొత్త సొగసులను .. హంగులను దిద్దుకుంటూ ముందుకు వెళుతోంది. ఎంతోమంది రచయితలు ఎప్పటికప్పుడు పాటకు తమవంతు పరిమళాన్ని అందిస్తూ, అది మరింత ఉత్సాహంతో పరుగులు తీసేలా చేస్తున్నారు. సముద్రాల వారి నుంచి తీసుకుంటే ఇప్పటివరకూ పాట ఎంతగా తనని తాను మార్చుకుంటూ .. మనసులను దోచుకుంటూ వెళుతుందో అర్థమవుతుంది. అలాంటి పాటల రచయితలలో అనంత శ్రీరామ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కనిపిస్తుంది. ప్రేమ పాటల్లో తనదైన ముద్ర కనిపిస్తుంది.

తాజా ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ .. " సినిమాలకి మాటలు కూడా రాయవచ్చును కదా అని చాలామంది అడుగుతున్నారు. ఒక పాట రాస్తే సంగీత దర్శకుడుగానీ .. దర్శక నిర్మాతలు గాని మార్పులు చేయమని అడుగుతారు.

అదే మాటలు రాస్తే సెట్ అసిస్టెంట్ దగ్గర నుంచి హీరో వరకూ అందరూ కూడా మార్పులు చేయమని అడుగుతారు. ఎందుకొచ్చిన తలపోటు అని చెప్పేసి అటు వైపు వెళ్లలేదు. ఒకసారి పాటలు రాయడంలో ఉన్న సౌలభ్యానికి అలవాటు పడిన తరువాత మాటల వైపుకు వెళ్లడానికి మనసు అంగీకరించదు.

పాటల రచయితగా 1100 పైగా పాటలు రాయడం వలన ఎంతోకొంత గుర్తింపు వచ్చింది. మాటల రచయితగా నా ప్రయాణం మళ్లీ మొదటి మెట్టు దగ్గర నుంచి మొదలుపెట్టాలి. అది ఇష్టం లేకపోవడం వల్లనే నా మార్గంలో నేను ముందుకు వెళుతున్నాను. నా సీనియర్స్ నుంచి నేను కేవలం రచన మాత్రమే నేర్చుకోలేదు .. ఆర్ధిక స్థిరత్వం ఉండాలనే విషయాన్ని కూడా నేర్చుకున్నాను. ఎంతో పాండిత్యం ఉండి విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించాలని ఉండి కూడా ఆర్థిక పరమైన సమస్యల వలన తమకి మనస్కరించని పాటలు రాసినవారున్నారు.

ఆర్థికపరమైన ప్రణాళిక లేకపోవడం వలన .. ఎన్నో వేల పాటలు రాసినా రేపెవరైనా అప్పిస్తారా అని ఎదురుచూసినవారున్నారు. మనకి ఆర్థికపరమైన స్థిరత్వం ఉంటేనే మన వృత్తి మనకి ప్రశాంతంగా ఉంటుందనే విషయం నాకు అర్థమైంది.

నా సమకాలీన రచయితలు ఆర్థికపరమైన స్థిరత్వాన్ని పొంది ఎంత హాయిగా ఉంటున్నారనేది కూడా చూశాను. అందువల్లనే ఆచి తూచి అడుగులు వేస్తుంటాను. నా పూర్వతరం రచయితలు మహా వృక్షాలవంటివారు. వాళ్లంతటి ప్రతిభాపాటవాలు ఉండి ఉంటే మరీ ఇంత పిరికితనం కూడా ఉండేది కాదేమో!" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News