విలీన దిశగా ఆ రెండు మల్టీఫ్లెక్స్.. అదే జరిగితే ఏం కానుంది?

Update: 2022-03-08 04:51 GMT
సింగిల్ థియేటర్.. గ్రూప్ థియేటర్ల కాన్సెప్టుకు భిన్నంగా కొంతకాలం క్రితం దేశంలో మల్టీప్లెక్సుల కల్చర్ మొదలైన సంగతి తెలిసిందే. మల్టీఫ్లెక్స్ అన్నంతనే గుర్తుకు వచ్చేది పీవీఆర్.. సినీ పోలీస్.. ఐనాక్స్ లు గుర్తుకు వస్తాయి. మరికొన్ని మల్టీఫ్లెక్సులు ఉన్నప్పటికి అవేమీ వీటి దరికి రావు. ఇదిలా ఉంటే.. పీవీఆర్.. సినీ పోలీస్ రెండు సంస్థలు విలీన దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే భారత మల్టీఫ్లెక్సుల వ్యాపారం ఇక రెండు సంస్థల మధ్యే ఉండనుంది. నిజానికి చైనా.. అమెరికాతో పోలిస్తే.. భారత్ లో  స్క్రీన్ల సంఖ్య చాలా తక్కువని చెప్పాలి. చైనాలో 80వేలకు పైనే స్క్రీన్లు ఉంటే.. అమెరికాలో ఇది 44వేలు మాత్రమే. భారత్ లో 10వేల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. దేశీయంగా పీవీఆర్ కు 846 స్క్రీన్లు ఉంటే.. సినీ పోలీస్ కు 417 స్క్రీన్లు ఉన్నాయి. ఈ రెండు కలిస్తే మొత్తం 1263 స్క్రీన్లతో దేశంలోనే అతి పెద్ద మల్టీఫ్లెక్స్ సంస్థగా మారనుంది. విలీన సంస్థపై మొదటి మూడు సంవత్సరాలు పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లీకి యాజమాన్య నియంత్రణ ఉంటుందని చెబుతున్నారు. మెక్సికన్ థియేటర్ చైన్ అనుబంధ సంస్థగా మంచి పేరున్న సినీపోలీస్ ఇండియా.. దేశీయ మల్టీఫ్లెక్సు సంస్థ అయిన పీవీఆర్ లో విలీనమైతే.. సినిమా థియేటర్ల వ్యాపారంలో 35-37 శాతం వాటా దక్కుతుందన్న మాట వినిపిస్తోంది.

విలీన ప్రక్రియలో భాగంగా తమకున్న స్క్రీన్లకు సంబంధించి ఒక్కో స్క్రీన్ కు రూ.9 కోట్ల చొప్పున సినీ పోలీస్ లెక్క కడుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ విలువ పీవీఆర్ తో పోలిస్తే 25 శాతం తక్కువగా చెబుతున్నారు. ఈ విలీన ప్రక్రియ పూర్తి అయిన పక్షంలో దేశంలో మల్టీఫ్లెక్సుల రంగంలో రెండు సంస్థలదే గుత్తాధిపత్యంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.  వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఐనాక్స్ - సినీ పోలీస్ మధ్య విలీన చర్చలు జరిగాయి. అయితే.. అవి వర్కుట్ కాలేదు.

అనంతరం 2018లో సినీపోలీస్ కీలక ప్రకటన చేసింది. తాము 500 స్క్రీన్లను తీసుకొస్తామని.. ఇందుకోసం రూ.1500కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. కొవిడ్ కారణంతో అలాంటిదేమీ జరగలేదు. ఇక.. ఈ విలీన ప్రక్రియలో సౌతిండియా స్టార్లు సైతం కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో తెలుగు.. తమిళ చిత్రాలు మహా అయితే వారి రాష్ట్రాలతో పాటు.. పక్కనున్న ఒకట్రెండు రాష్ట్రాల్లో పరిమిత మోతాదులో మాత్రమే ఆడేవి.

ఇటీవల ఆ సీన్ మారింది. సౌతిండియా స్టార్ నటుల సినిమాలు దాదాపుగా పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందించేలా ప్లాన్ చేయటం.. దీని వల్ల ఆదాయం పెరుగుతుండటంతో ఇప్పుడు వాటి మీదనే ఫోకస్ పెరిగింది. దీంతో.. చిత్రాల్ని ప్రదర్శించేందుకు స్క్రీన్ల అవసరం ఎక్కువైంది. ఈ విలీన ప్రక్రియలో ఇది కూడా కీలకం కానుందన్న మాట వినిపిస్తోంది. తాజా డీల్ విషయానికి వస్తే.. మెట్రో నగరాల్లో పీవీఆర్ కు ఎక్కువ స్క్రీన్లు ఉన్నాయి. దీనికి తోడు.. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు స్క్రీన్ల చైన్ ఉంది.

అదే సమయంలో సినీ పోలీస్ కు మెట్రోయేతర నగరాల్లో అత్యధిక స్క్రీన్లు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు చేతులు కలిపితే.. తిరుగులేని అధిక్యత సొంతమవుతుందని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో సగటు ప్రేక్షకుడికి జరిగే నష్టం ఏమంటే.. సంస్థల మధ్య పోటీ తగ్గి.. గుత్తాధిపత్యం ధోరణి.. వినియోగదారుడి ప్రయోజనాన్ని దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ విలీన ప్రక్రియ మీద ఈ రెండు సంస్థలు పెదవి విప్పలేదు.
Tags:    

Similar News