పారితోషకం మొత్తం వెనక్కిచ్చేశాడు

Update: 2017-02-08 10:11 GMT
రాఘవ లారెన్స్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. సేవా కార్యక్రమాల కోసం కోట్లు కోట్లు ఖర్చు చేసే అతను.. తాజాగా ఒక నిర్మాత శ్రేయస్సు కోరి.. తన సినిమా సజావుగా విడుదల కావాలని మొత్తం తన పారితోషకాన్నే వెనక్కి ఇచ్చేయడం కోలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది. తెలుగులో రెండేళ్ల కిందట బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘పటాస్’ సినిమాను లారెన్స్ హీరోగా తమిళంలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం పేరు.. మొట్ట శివ కెట్ట శివ. అగ్ర నిర్మాత ఆర్.బి.చౌదరి.. మదన్ అనే మరో నిర్మాతతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఐతే సినిమా పూర్తయ్యాక మదన్ కనిపించకుండా పోయాడు. అతను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు.

దీంతో ఆరు నెలల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తోంది. మదన్ ఈ మధ్యే చెన్నైకి వచ్చినా అతడి ఆర్థిక వివాదాలు ఇంకా పరిష్కారమవ్వలేదు. దీంతో ‘మొట్ట శివ కెట్ట శివ’ రిలీజ్ సంగతి తేలేలా కనిపించలేదు. ఆర్.బి.చౌదరి కూడా కొంత ఇబ్బందుల్లో ఉండటంతో లారెన్స్ ఈ సినిమాను బయటికి తేవడానికి నడుం బిగించాడు. ఈ సినిమాకు తాను తీసుకున్న పారితోషకాన్ని వెనక్కి ఇచ్చాడు. రిలీజ్ తర్వాత డబ్బులొచ్చాక రెమ్యూనరేషన్ తీసుకుంటానని.. ముందు ఈ డబ్బులతో సినిమాను విడుదల చేయించాలని చెప్పాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 17న రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. ఐతే అదే రోజు లారెన్స్ మరో సినిమా ‘శివలింగ’ కూడా విడుదలకు రెడీ అయింది. ఈ రెండిట్లో ఒకటి వాయిదా పడే అవకాశాలున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News