'#RC15' కోసం 'RRR' డైలాగ్ రైటర్..!

Update: 2021-07-13 15:30 GMT
దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ 50వ సినిమా.. చరణ్ కెరీర్ లో 15వ చిత్రం కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు - సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. '#RC15' కోసం ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాయడానికి తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సాయి మాధవ్.. శంకర్ తో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

''జెంటిల్ మ్యాన్ సినిమా చూసి దర్శకుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన చిత్రానికి సంభాషణలు రాస్తున్నాను. థ్యాంక్స్ శంకర్ సర్.. థాంక్స్ దిల్ రాజు గారు అండ్ థాంక్స్ మెగా పవర్ స్టార్ చరణ్ బాబు'' అని సాయి మాధవ్ బుర్రా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా శంకర్ తో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోని షేర్ చేశారు. కాగా, టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా గుర్తింపు పొందుతున్న సాయి మాధవ్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవల 'క్రాక్' చిత్రానికి మాటలు అందించి బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి మాధవ్.. ప్రస్తుతం రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి మాటలు రాస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమాకి కూడా ఆయనే సంభాషణలు అందిస్తున్నారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.

ఇంతకముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించిన 'ఖైదీ నెం.150' 'సైరా' వంటి సినిమాలకు బుర్రా సాయి మాధవ్ డైలాగ్ రైటర్ గా పని చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు చరణ్ - శంకర్ కలయికలో వస్తున్న 'RC15' చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఈ సినిమా 'ఒకే ఒక్కడు' తరహాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. ఇందులో చరణ్ పొలిటీషియన్ గా నటిస్తారని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే శంకర్ స్టోరీకి సాయి మాధవ్ డైలాగ్స్ జత కలిస్తే సీన్స్ అద్భుతంగా వస్తాయని మెగా అభిమానులు భావిస్తున్నారు. మరి మెగా వారసుడి నోటి వెంట సాయి మాధవ్ ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ పలికిస్తాడో చూడాలి.

ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' మరియు 'ఆచార్య' చిత్రాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటిస్తున్న ట్రిపుల్ ఆర్ టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి అయింది. రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉండగా.. ఆగస్ట్ నెలాఖరుకు అవి కూడా కంప్లీట్ చేయనున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తన తండ్రి చిరంజీవి తో కలసి నటిస్తున్న 'ఆచార్య' షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయింది. మరో వారంలో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో శంకర్ దర్శకత్వంలో #RC15 చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని చరణ్ ప్లాన్స్ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News