మైక్ టైసన్ కు టాటా చెప్పిన 'లైగర్' టీమ్..!

Update: 2021-11-30 15:35 GMT
డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ''లైగర్''. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ట్యాగ్ లైన్. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాతో మొట్ట మొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే సంగతి తెలిసిందే. ఇటీవల యూఎస్ఏ లో ప్రారంభమైన ఫైనల్ షెడ్యూల్ లో టైసన్ - విజయ్ లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణతో ''లైగర్'' షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చిత్ర బృందం అతనితో అద్భుతమైన క్షణాలను గడిపిందని చెబుతూ.. టైసన్ దంపతులతో డిన్నర్ చేస్తున్న సందర్భంలోని కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఇందులో మైక్ తో పాటుగా పూరీ జగన్నాథ్ - విజయ్ లతో పాటుగా హీరోయిన్ అనన్య పాండే - నిర్మాత ఛార్మీ కౌర్ ఫోటోలకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

కాగా, 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నారు. దీని కోసం గంటల తరబడి జిమ్ లో వర్కవుట్స్ చేసి మేకోవర్ అవడమే కాకుండా.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నారు. పూరీ ఈ సినిమాతో కొత్త రౌడీని ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన వీడీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ లభించింది. యూఎస్ షెడ్యూల్ పూర్తవడంతో చిత్ర బృందం ఇప్పుడు మ్యూజిక్ కంపోజిషన్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2022 ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

'లైగర్' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. థాయ్లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా.. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Tags:    

Similar News